పవన్ బాబుతో కలిస్తే అసలు ఊరుకోరుట... మాజీ మంత్రిది దాష్టికమేనా...?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది సొంత పార్టీ. ఆయన పార్టీకి ఒక రాజకీయ విధానం ఉంటుంది.
By: Tupaki Desk | 7 Aug 2023 12:18 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది సొంత పార్టీ. ఆయన పార్టీకి ఒక రాజకీయ విధానం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలా లేక ఇతర పార్టీలతో కలసి పోటీ చేయాలా అన్నది పవన్ ఇష్టం. ఆ విషయంలో వైసీపీ నేతలు మాత్రం కౌంటర్లు సెటైర్ల నుంచి పీక్స్ కి వెళ్ళిపోయి ఇపుడు ఏకంగా చంద్రబాబుతో పవన్ కలిస్తే అసలు ఊరుకునేది లేదని వార్నింగులే ఇస్తున్నారు.
ఈ వార్నింగ్ ఇచ్చేది ఎవరో కాదు మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన కొడాలి నాని. చాలా రోజుల తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబును పట్టుకుని చాలానే అనేశారు. బాబు పద్నాలుగేళ్ల సీఎం గా ఒక్క ప్రాజెక్టునూ ఏపీలో ఎందుకు కట్టలేదని నిలదీశారు మళ్లీ అధికారం ఇవ్వండి కడతాను అంటే నమ్మేదెవరు అని నిందించారు. బాబు చెప్పేవన్నీ ఊకదంపుడు మాటలే అని తీసి పారేశారు.
పవన్ కళ్యాణ్ విషయం మీద కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తన పార్టీ పటిష్టత కోసం వారాహి మూడవ యాత్ర కాదు ఎన్ని యాత్రలు అయినా ఏపీలో చేసుకోవచ్చు అని కొడాలి అంటున్నారు. అలాగే ఎన్నికలు అయ్యేదాకా ఏపీ అంతా కలియతిరిగినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం మీద ఎన్ని అయినా విమర్శలు చేసుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు నాని.
కానీ చంద్రబాబుని వెనకేసుకుని వస్తే మాత్రం అసలు బాగోదని నాని అంటున్నారు. బాబు వంటి వారి వల్లనే ఏపీ నాశనం అయిందని, ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పార్టీ రెండూ కలసి మొత్తం కాలమంతా పాలించాయని, ఆ పార్టీల వల్లనే ఏపీ సర్వనాశనం అయిందని, అందువల్ల మళ్లీ టీడీపీకి సపోర్ట్ చేసి ఏపీలో ఊపిరి పోస్తామంటే ఊరుకోబోమని నాని ఖరాఖండీగా పవన్ కి చెప్పేశారు
అంటే పవన్ ని టీడీపీతో పొత్తులు పెట్టుకోవద్దు అని డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు అన్న మాట. ఏపీలో చూస్తే పొత్తుల కధ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పవన్ అయితే వైసీపీ వ్యతిరేకత కూటమి కడతామని పదే పదే ప్రకటిస్తున్నారు. దాంతో టీడీపీ జనసేనల మధ్యన పొత్తు ఖాయమని అంతా భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో చంద్రబాబుకు పవన్ మద్దతు వద్దు అని వైసీపీ మాజీ మంత్రి అనడం మాత్రం రాజకీయంగా చర్చకు తావిస్తోంది. అయినా తాను సొంతంగా పోటీ చేసి వీరమరణం పొందలేనని పవన్ చాలా సార్లు చెప్పారు. ఇపుడు వైసీపీ నేతల మాట ఆయన ఎందుకు వింటారు అన్నది ప్రశ్నగా ముందుకు వస్తోంది.
ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో పవన్ ఫ్యాక్టర్ ఏంటి అన్నది 2024 ఎన్నికలు చూపిస్తాయనే అంటున్నారు. ఇక పవన్ సహా ఎవరు చంద్రబాబుకు మద్దతు ఇచ్చినా వారిని పూర్తి స్థాయిలో ఎదుర్కొంటామని కొడాలి నాని ఇచ్చిన మాస్ వార్నింగ్ మీద ఇపుడు అతి పెద్ద చర్చ సాగుతోంది.