జగన్ మేనిఫెస్టో మీద ఎమ్మెల్యేలలో అసంతృప్తి?
వైసీపీ మ్యానిఫేస్టో గేమ్ చేంజర్ అవుతుందని ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యే అభ్యర్ధులతో సహా అంతా పెద్ద ఆశలే పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 29 April 2024 11:25 AM GMTవైసీపీ మ్యానిఫేస్టో గేమ్ చేంజర్ అవుతుందని ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యే అభ్యర్ధులతో సహా అంతా పెద్ద ఆశలే పెట్టుకున్నారు. మ్యానిఫెస్టోలో కీలక అంశాల ప్రస్తావన ఉంటుందని తద్వారా ఆయా వర్గాల నుంచి భారీగా సానుకూలత వస్తుందని కూడా భావించారు.
కానీ వైసీపీ నేతలు అభ్యర్ధులు కొండంత ఆశలు పెట్టుకుంటే మ్యానిఫెస్టో మాత్రం భిన్నంగా వచ్చింది అని అంటున్నారు. నిజానికి చెప్పుకోవాలంటే జగన్ అంటే వెల్ ఫేర్ స్కీమ్స్ కి ఒక బ్రాండ్. అంతే కాదు డైరెక్ట్ పేమెంట్స్ అంటేనే కూడా జగన్ దేశంలోనే ఒక బ్రాండ్ గా ఉన్నారు.
ఇక సామాజిక పెన్షన్లను ప్రతీ ఇంటికీ వాలంటీర్ల ద్వారా ఇప్పించి జగన్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. అందుకే జగన్ అంటే ఒంటి కాలి మీద లేచే చంద్రబాబు కూడా వాలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు.
ప్రజల విషయానికి వస్తే వారికి అప్పులు సొప్పులు అన్నవి అనవసరం. అప్పులు తెచ్చారా లేదా అన్నది కూడా చూడరు. మాకు ప్రభుత్వం నుంచి వచ్చిందేంటి అనే చూస్తారు. వాటినే వారు సంతృప్తిగా అందుకుంటారు. ఇక చంద్రబాబు తనదైన అభివృద్ధి బ్రాండ్ నుంచి ఈసారి పక్కకు జరిగారు. తన ఆలోచనలను సైతం పక్కన పెట్టి సూపర్ సిక్స్ పధకాలను ప్రకటించారు.
పెన్షన్ ఏకంగా నాలుగు వేల రూపాయలకు చంద్రబాబు పెంచేశారు. అది కూడా తాము అధికారంలోకి వస్తే మొదటి నెల నుంచి ఇస్తామని భారీ హామీ కూడా ఇచ్చారు. చంద్రబాబు అంటే అభివృద్ధికి మారు పేరుగా చెబుతారు. అలాగే గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా కూడా ఆయన్ని చూస్తారు.
అటువంటి చంద్రబాబు ఇపుడు తన బ్రాండ్ ని సైతం పక్కన పెట్టి సూపర్ సిక్స్ అంటూ సంక్షేమ పధకాల మీదనే ఆధార పడ్డారు అంటేనే ఏపీలో జనాల మూడ్ ఏంటో అర్ధం చేసుకోవాల్సి ఉంది. జగన్ ఇస్తున్న నవరత్నాలనే కాపీ కొడుతూ వాటిని ఇబ్బడి ముబ్బడిగా ఇస్తామంటూ కూడా అన్ని పధకాలకు భారీ మొత్తాలు పెంచేశారు.
ఇవన్నీ ఇలా ఉంటే వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో జనాలు జగన్ నే నమ్ముతారు. అందులో రెండవ మాట లేదు కానీ జనాలకు ఆశ ఎక్కువ. ఆ మాటకు వస్తే ప్రతీ మనిషికీ ఆశ ఉంటుంది. దాంతో జగన్ కంటే ఎక్కువ పధకాలు వాటికి ఎక్కువ సొమ్ము ఇస్తామని అంటే చంద్రబాబుని జనాలు నమ్ముతారా అన్న చర్చ కూడా ఇపుడు సాగుతోంది.
వీటిని అన్నిటినీ బేరీజు వేసుకుంటున్న జగన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఎంపీ అభ్యర్ధులు అంతా కూడా ఆయన విడుదల చేసిన మ్యానిఫేస్టో మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు అని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఒక లక్ష రూపాయల వరకైనా రైతు రుణ మాఫీ హామీ ఇచ్చి అమలు చేసి ఉంటే ఈసారికి వైసీపీ ప్రభుత్వం గ్యారంటీ అన్నది వారి నమ్మకం.
జగన్ చెప్పింది చేస్తారు కాబట్టి రైతులు అంతా ఒక అతి పెద్ద సెక్షన్ గా వైసీపీ వైపు టర్న్ అవుతారు అని కూడా వారు అంచనా వేసుకుంటున్నారు. ఇలా చూస్తే కనుక జగన్ తమ సొంత పార్టీ వారినే తీవ్ర అసంతృప్తికి గురి చేశారు అని అంటున్నారు. నిజానికి రానున్న అయిదేళ్లలో ఆదాయం మరింతగా పెరగవచ్చు. దానికి తోడు సామాజిక పెన్షన్ వంటి వాటి విషయంలో ఉదారంగా ఉండాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
జగన్ ఎందుకో చాలా పొదుపు పాటించారు అన్న మాట వినిపిస్తోంది. దీని వల్ల ఎన్నికల గండం గట్టెక్కడానికి అంతా ఆలోచిస్తున్నారు. రేపటి రోజున టీడీపీ కూటమి అదిరిపోయే మేనిఫెస్టో రిలీజ్ చేస్తే జనాలు కచ్చితంగా అటే మొగ్గుతారు అని అంటున్నారు . ఎందుకంటే ఇది రాజకీయం ప్రజల ఆశలతో ఆడుకునే జూదం. చంద్రబాబు మీద జనాలకు నమ్మకం లేదు నమ్మరు అనుకుంటే ఆయన పార్టీ నుంచి ఎన్నో సార్లు బయటకు వచ్చిన నేతలు తిరిగి ఎందుకు చేరుతున్నారు.
అందరిలో ఆశ ఉంటుంది. మరి బాబుతో పనిచేసి విభేదించే నాయకులే చేరినపుడు ప్రజలు ఎందుకు మారిపోరు అన్నది ఒక చర్చ. ప్రజలు ఈ రోజు విషయం ఆలోచిస్తారు. లేకపోతే ఎన్నికల ముందు రోజు ఓటుకు నోటు కధలు ఎన్నో ఎందుకు వినిపిస్తాయి అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ ది అతి నమ్మకమా లేక బాబుని అసలు నమ్మరని విపరీతమైన ధీమా అన్నది మాత్రం ఎన్నికల ఫలితాలు తేలుస్తాయని అంటున్నారు.