Begin typing your search above and press return to search.

గాజువాకలో వారసుడికి వైసీపీ సీటు...?

వైసీపీలో వారసులకు సీట్లు ఉంటాయా లేదా అన్న చర్చ ఒక వైపు సాగుతోంది.

By:  Tupaki Desk   |   1 Oct 2023 4:06 AM GMT
గాజువాకలో వారసుడికి వైసీపీ సీటు...?
X

వైసీపీలో వారసులకు సీట్లు ఉంటాయా లేదా అన్న చర్చ ఒక వైపు సాగుతోంది. చాలా మంది సీనియర్ నేతలు తమ వారసులకు టికెట్ ఇస్తే తాము హాయిగా పార్టీకి సేవ చేస్తూ తెర వెనక ఉంటామని ఇప్పటికే అధినాయకత్వానికి చెబుతూ వస్తున్నారు. విన్నపాలూ చేసుకుంటున్నారు. అయితే అధినాయకత్వం కొందరి విషయంలో మాత్రమే సుముఖంగా ఉంటోంది. దానికి కూడా అనేక రకాల కారణాలను చూస్తూ సమీకరణలను బేరీజు వేస్తూ ఓకే చెబుతోంది.

అలా ఉత్తరాంధ్రాలో చూసుకుంటే ఒక ఎమ్మెల్యే వారసుడికి పచ్చ జెండా పార్టీ హై కమాండ్ ఊపింది అని అంటున్నారు. గాజువాకలో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే ఓడించి గెలిచిన జెయింట్ కిల్లర్ తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవాన్ రెడ్డి కి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు హై కమాండ్ ఓకే చెప్పింది అన్నది ఇపుడు చర్చనీయాంశం అవుతోంది.

తిప్పల నాగిరెడ్డి 2006లో తొలిసారిగా కార్పోరేటర్ గా గెలిచారు. 2009లో గాజువాక నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2014లో ఆయన రెండవసారి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ఇక ముచ్చటగా మూడవసారి 2019లో పోటీ చేయడం పవన్ మీదనే గెలవడంతో గాజువాక హీరో అయిపోయారు. అలా విశాఖలో కీలకమైన నియోజకవర్గంగా పారిశ్రామికవాడగా గాజువాకలో గెలిచిన తిప్పల కేవలం నాలుగేళ్ల కాలంలోనే ధీటైన వారసుడిని తయారు చేశారు.

ఒక విధంగా ఎమ్మెల్యే అంటే దేవాన్ రెడ్డి అన్న భావన అందరిలో ఉంది. పార్టీలోనూ జనంలోనూ అలా పేరు తెచ్చుకున్న దేవాన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇక గాజువాకలో యూత్ లీడర్ గా ఆయన దూకుడు చేస్తున్నారు ఈ పరిణామాల నేపధ్యంలో ఆయన్నే పోటీకి పెట్టాలని కూడా వైసీపీ అధినాయకత్వం డిసైడ్ అయిందని అంటున్నారు.

ఇక మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఎమ్మెల్యే టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ దేవాన్ రెడ్డికే వైసీపీ పెద్దలు ఓటు వేశారని అంటున్నారు. దీంతో ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.

అయితే తిప్పల నాగిరెడ్డికి బలం ఉండడంతో పాటు మిగిలిన మాజీ ఎమ్మెల్యేల కంటే నాగిరెడ్డి ఫ్యామిలీకే పట్టు ఉండడంతో టికెట్ వారసుడికి దక్కిందని అంటున్నారు. ఓల్డేజ్ కారణంగానే నాగిరెడ్డిని పక్కన పెడుతున్నారని అంటున్నారు. గాజువాకలో వచ్చేసారి ఎన్నికలు హోరా హోరీగా జరుగుతాయి. టీడీపీ ప్లస్ జనసేనలను తట్తుకుని నాగిరెడ్డి వారసుడు ఎలా గెలుస్తారు అన్నది చూడాల్సి ఉంది.