Begin typing your search above and press return to search.

ఈడీ కేసు వ్యవహారంపై స్పందించిన విక్రం రెడ్డి... సహకారంపై స్పష్టత!

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Oct 2023 6:18 AM GMT
ఈడీ కేసు వ్యవహారంపై స్పందించిన విక్రం రెడ్డి... సహకారంపై స్పష్టత!
X

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. మేకపాటి కుటుంబానికి కేఎంసీ అనే సంస్థ ఉంది. ఈ సంస్థకు అనుబంధంగా గురువాయూర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఐపీఎల్) అనే సంస్థ ఏర్పాటైంది. దీంతో... కేరళలో రహదారుల నిర్మాణం కోసం కేఎంసీ తరఫున జీఐపీఎల్ స్థాపించారని చెబుతున్నారు.

ఈ క్రమంలో కేరళలో రహదారుల నిర్మాణం కోసం కేఎంసీ తరఫున స్థాపించిన జీఐపీఎల్ సంస్థ రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండానే బస్ షెల్టర్లు నిర్మించకుండానే.. టోల్ చార్జీలు, ప్రకటన చార్జీలు వసూలు చేస్తోందని ఆరోపణలు వచ్చాయి! దాంతో ఈడీ పలు చోట్ల సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో... విక్రం రెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారంటూ ఈడీ కేసు నమోదు చేసింది!

ఈ తరుణంలో ఈ వ్యవహారంపై మేకపాటి విక్రం రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... సుమారు 50 ఏళ్లుగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యాపార రంగంలో ఉన్నామని తెలిపారు. ఇదే క్రమంలో పబ్లిక్, ప్రైవేటు ప్రాజెక్టు పనుల్లో ఇలాంటి విచారణలు సాధారణమేనని.. అదేవిధంగా తమ కంపెనీపైనే కాదు, తమతో కలిసి పనిచేస్తున్న మరో కంపెనీపైనా విచారణ జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా... ఈడీ కోరిన డాక్యుమెంట్లు ఇప్పటికే ఇచ్చామని, విచారణకు అన్నివిధాలుగానూ సహకరిస్తామని స్పష్టం చేశారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం మేకపాటి గౌతం రెడ్డి మంత్రి అయ్యారు. ఏపీ సీఎంకి ఎంతో సన్నిహితంగా ఉండే ఆయన హఠాన్మరణం చెందడంతో.. ఆత్మకూరు నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో గౌతం రెడ్డి వారసుడిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రం రెడ్డి బరిలోకి దిగారు. ఈ ఎన్నికలో విక్రం రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

కాగా... 2006 నుంచి 2016 మధ్యకాలంలో కేరళలోని పాలక్కాడ్‌ లో 47వ నేషనల్ హైవే నిర్మాణానికి సంబంధించిన రెండు సెక్షన్ల నిర్మాణ పనుల్లో మేకపాటి విక్రం రెడ్డికి సంబంధించిన కంపెనీలు అవకతవకలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. దీనివల్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ)కి సుమారు 102 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఈడీ అధికారులు అంచనా వేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో... ఈ జాతీయ రహదారి నిర్మాణంలో ప్రధాన కాంట్రాక్ట్ కంపెనీ జీఐపీఎల్‌ కు కేఎంసీ సబ్-కాంట్రాక్టింగ్ వ్యవహరించిందని తెలుస్తోంది. కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్.. రోడ్డు ప్రాజెక్ట్ పూర్తి ధృవీకరణ పత్రాన్ని మోసపూరితంగా పొందిందని, అక్రమంగా టోల్ మొత్తాన్ని వసూలు చేసిందని ఈడీ అధికారులు నిర్ధారించినట్లు కథనాలొస్తున్నాయి!

ఈ సమయంలో కేసు నమోదు చేయడానికి ముందు ఈడీ అధికారులు హైదరాబాద్‌ లోని కేఎంసీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది! ఈ క్రమంలోనే విక్రం రెడ్డి స్పందించారు.. ఈడీ అధికారులకు అన్ని విధాలా సహకరిస్తామని వెల్లడించారు.