Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేళ.. వైసీపీకి మరో భారీ ఎదురుదెబ్బ!

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి

By:  Tupaki Desk   |   14 Aug 2024 12:28 PM GMT
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేళ.. వైసీపీకి మరో భారీ ఎదురుదెబ్బ!
X

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు.. ఆళ్ల నాని, కిలారి రోశయ్య, పెండెం దొరబాబు, రావెల కిశోర్‌ బాబు వంటి వారు వైసీపీకి రాజీనామా చేశారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, నగరపాలక సంస్థల్లో కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. ఇటీవల విశాఖ కార్పొరేటర్లు, కుప్పం మున్సిపల్‌ కౌన్సిలర్లు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నగర మేయర్‌ సుజాతతో పాటు డిప్యూటీ మేయర్, మరో 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి వైసీపీకి రాజీనామా ప్రకటించారు. నాయుడుపాలెంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సమక్షంలో వారంతా టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలో ఒంగోలు కార్పొరేషన్‌ ను టీడీపీ హస్తగతం చేసుకునేదిశగా అడుగులు వేస్తోంది. ఒంగోలు కార్పొరేషన్‌ లో మొత్తం 50 కార్పొరేట్‌ స్థానాలు ఉన్నాయి. వీటిలో 43 స్థానాలను వైసీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీడీపీలో చేరినవారితో కలిపి ఆ పార్టీ బలం 24కు పెరిగింది. ఇక ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలతోపాటు ఒంగోలు ఎంపీకి ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒంగోలు కార్పొరేషన్‌ ను హస్తగతం చేసుకునే దిశగా టీడీపీ అడుగులేస్తోంది. ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు, ఒంగోలు ఎంపీతో కలిపి టీడీపీకి 27 మంది సభ్యుల బలం ఉంది. దీంతో టీడీపీ చేతిలోకి కార్పొరేషన్‌ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

కార్పొరేటర్లు చేజారకుండా మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అయిన బాలినేని శ్రీనివాసులరెడ్డి గట్టి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. పైగా పార్టీ మారాలనుకుంటున్నవారు పోతే పోవచ్చంటూ ఆయన వ్యాఖ్యానించడం కొంపముంచిందని చెబుతున్నారు.

ప్రస్తుత మేయర్‌ గంగాడ సుజాతను కొనసాగించేందుకు బాలినేని ఒప్పుకోలేదని.. మరొకరికి మేయర్‌ పదవిని కట్టబెట్టడానికి ఆయన సిద్ధమయ్యారని.. దీంతో మేయర్‌ గంగాడ సుజాతతో సహా కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారని టాక్‌ నడుస్తోంది.