Begin typing your search above and press return to search.

టీడీపీలో చేరనున్న ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు వీరే!?

ఇటీవలి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   12 July 2024 6:07 AM GMT
టీడీపీలో చేరనున్న ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు వీరే!?
X

ఇటీవలి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. వై నాట్‌ 175 అని చివరకు ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని స్థితికి ఆ పార్టీ పతనమైంది. కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలనే గెలుచుకుంది.

ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీ అధినేత పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. మనకు శాసనసభలో మెజారిటీ లేదని... శాసనమండలిలో మెజారిటీ ఉంది కాబట్టి ప్రభుత్వ విధానాలపై గట్టిగా పోరాడాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీలదే ఇప్పుడు కీలక పాత్ర అని చెప్పారు.

ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకి 30 మంది, టీడీపీకి 9, జనసేనకు 1, పీడీఎఫ్‌ కు 2, ఇండిపెండెంట్లు 4, నామినేటెడ్‌ అయిన సభ్యులు 8 మంది ఉన్నారు. మరో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. ముఖ్యంగా రాయలసీమలోనే ఐదుగురు ఎమ్మెల్సీలు ఈ బాటలో ఉన్నారని అంటున్నారు. వైఎస్సార్‌ జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం, అలాగే మైనార్టీ వర్గానికే చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలతోపాటు, ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయిన మరో ఇద్దరు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌ గా ఉన్న జకియా ఖానం పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆమె ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీలో చేరడానికి ఆమె ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది.

రాయచోటికి చెందిన తమను రాజకీయంగా ఎదగనీయకుండా వైసీపీలో కొందరు నేతలు కుట్రపన్నారని జకియా ఖానం ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదని.. కేవలం తమను ఉత్సవ విగ్రహాల మాదిరిగానే చూశారని ఆమె బాధపడినట్టు తెలుస్తోంది.

అలాగే పార్టీ మారాలనుకుంటున్న ఎమ్మెల్సీలు కూడా ఇదే భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఐదేళ్లలో ఏనాడు వైసీపీ అధినేత జగన్‌ తమతో భేటీ కాలేదని.. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోగానే తమను పిలిచి.. ప్రభుత్వం పోరాటం చేయాలంటున్నారని మరికొందరి ఎమ్మెల్సీలు మండిపడుతున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో రాయలసీమకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కాగా అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు, వివాదాస్పదులైన నేతలు, అసభ్యంగా మాట్లాడుతూ బూతులు తిట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకోవద్దని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి వివాదాలు లేనివారు, సౌమ్యులు అయితేనే టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీలో చేరాలనుకుంటున్న వైసీపీ నేతలకు టీడీపీ నేతలు ఇదే విషయాన్ని చెబుతున్నారు. పార్టీలో చేరికకు చంద్రబాబు, నారా లోకేశ్‌ ఒప్పుకుంటేనే అని మెలికపెడుతున్నారని తెలుస్తోంది.