అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందే....ఏం జరుగుతోంది...?
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణా హై కోర్టు ఇచ్చిన బెయిల్ ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టుని సీబీఐ ఆశ్రయించింది.
By: Tupaki Desk | 3 Sep 2023 7:29 AM GMTకడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణా హై కోర్టు ఇచ్చిన బెయిల్ ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టుని సీబీఐ ఆశ్రయించింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ లో పేర్కొనడం విశేషం.
వివేకాతో అవినాష్ కుటుంబానికి రాజకీయంగా విభేదాలు ఉన్నాయని వెల్లడించింది. అంతే కాదు అవినాష్ తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, మరో నిందితుడి శివశంకర్ రెడ్డిలకు ఈ కేసులో ప్రధాన పాత్ర ఉందని వివరించింది. వివేకా హత్య తరువాత ఆధారాలను కూడా ఈ ముగ్గురు సమక్షంలో చెరిపేసినట్లుగా సీబీఐ వెల్లడించింది.
ఇక హత్య తరువాత జరిగిన పరిణామాలను నిందితుడు షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారి స్టేట్మెంట్ లో పూర్తిగా వివరించారని సీబీఐ పేర్కొంది. అసలు ఎందుకు వివేకాతో అవినాష్ ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయన్నది కూడా పిటిషన్ లో సీబీఐ ప్రస్థావించింది.
వైఎస్ వివేకాకు 2017లో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఆయన్ని ఓడించారని, అలాగే 2019 ఎన్నికల్లో కడప ఎంపీ సీటు తనకు కానీ షర్మిలకు కానీ విజయమ్మకు కానీ ఇవ్వాలని వైఎస్ వివేకా డిమాండ్ చేశారని, దీన్ని భరించలేకనే హత్యకు కుట్ర పన్నారని కూడా సీబీఐ పేర్కొనడం విశేషం. ఇక వివేకా హత్యకు అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, వారు అనుచరుడు శివశంకర్ రెడ్డి కుట్ర పన్నినట్లుగా హత్యా స్థలంలో లభించిన సాక్ష్యాధారాలు చెబుతున్నాయని సీబీఐ చెప్పడం విశేషం.
మొత్తానికి అవినాష్ రెడ్డి బెయిల్ ని రద్దు చేయాలని సీబీఐ సుప్రీం కోర్టులో చాలెంజ్ చేయడం రాజకీయంగా మరోమారు కలకలం రేపుతోంది. అదే సమయంలో ఈ పిటిషన్ మీద ఈ నెల 11న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సుప్రీం కోర్టు దీని మీద ఏ విధంగా తీర్పు అన్నది తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. సుప్రీం కోర్టులో కనుక అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన అరెస్ట్ అనివార్యం అవుతుంది.
ఇప్పటికైతే తెలంగాణా హై కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ మేరకు ఆయన ప్రతి శనివారం సీబీఐ ముందు విచారణకు హాజరై వస్తున్నారు. ఈ కేసులో కొత్త విషయాలు ఏవీ చోటు చేసుకునే అవకాశాలు ఉండవని అంతా భావిస్తున్న నేపధ్యంలో ఇపుడు ఇది మరో మలుపు తిరిగింది. దీంతో ఈ నెల 11 మీదనే అందరి చూపు ఉంది. ఆ రోజు ఏదైనా వ్యతిరేక తీర్పు వస్తే మాత్రం ఏపీ రాజకీయాలలో సంచలనాలే నమోదు అవుతాయని అంటున్నారు