Begin typing your search above and press return to search.

'బీజేపీ వైపు మిథున్ చూపు'... ప్రమాణం అనంతరం క్లారిటీ!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Jun 2024 12:25 PM GMT
బీజేపీ వైపు మిథున్ చూపు... ప్రమాణం అనంతరం క్లారిటీ!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఘోర ఓటమి అనంతరం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు జగన్ కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా.. ప్రలోభాలకు లొంగొద్దని, కేసులకు భయపడొద్దని తెలిపారు. ఈ నేపథ్యలో ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నరనే ప్రచారం తెరపైకి వచ్చింది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.

అవును... ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి చెందిన కీలక నేతలు, ఎంపీలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరడం ఇటీవల ఆనవాయితీగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి! ఈ నేపథ్యంలోనే ఏపీలో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి నలుగురు లోక్ సభ ఎంపీలు ఉన్నారు. వీరిలో మిథున్ రెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం బలంగా నడిచింది.

ఈ నేపథ్యంలో... జరుగుతున్న ప్రచారంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఈ రోజు పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణం చేసిన ఆయన... లోక్ సభలో పార్లమెంటరీ పార్టీ నేతగా నియమితులయ్యారు. అనంతరం స్పందించిన ఆయన... బీజేపీలో చేరాల్సిన ఖర్మ తనకు పట్టలేదని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తాను పార్లమెంట్ లో ఏపీ తరుపున మాట్లాడతానని తెలిపారు.

కాగా... గత కొన్ని రోజులుగా వైసీపీ కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డిపై పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మిథున్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరబోతున్నారని.. ఈ మేరకు ఇప్పటికే ఆయన బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ మేరకు బీజేపీ నేతలే ఇలాంటి లీకులు ఇచ్చారనే ప్రచారమూ జరిగింది.

అక్కడితో ఆగని ఆ ప్రచారం.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలో చేరాలని మిథున్ ఒత్తిడి తెస్తున్నారనేవరకూ వెళ్లింది. మరోపక్క ఆ ప్రచారాలను వైసీపీ ఖండిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎంపీగా ప్రమాణం చేసిన మిథున్ రెడ్డి... వస్తున్న ప్రచారాలను తిప్పికొట్టారు. గతంలోనూ తనపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరిగాయని గుర్తుచేశారు.