తూర్పు తిరిగి దండం పెట్టేదెవరు... బరిలోకి వైసీపీ ఎంపీ...!
విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
By: Tupaki Desk | 4 Sep 2023 8:22 AM GMTవిశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆయన రంగంలోకి దిగిపోయారు. గడప గడప అంటూ ఒక మారు కొన్ని ప్రాంతాలలో తిరిగారు. విశాఖ తూర్పు లో టీడీపీని ఓడించి వైసీపీకి ఈసారి విజయం అందిస్తాను అని ప్రతిన పూనారు.
అయితే విశాఖ తూర్పులో హ్యాట్రిక్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబుని ఓడించడం అంత ఈజీగా అన్న ప్రశ్న ఎదురవుతోంది. అందరి వాడుగా పేరు తెచ్చుకుని జనంతో మమేకం అయిపోయి తూర్పు లో మంచి పట్టు సంపాదించేసిన వెలగపూడి వైఎస్సార్ జగన్ వేవ్ లను సైతం తట్టుకుని గెలిచారు.
విశాఖ తూర్పులో యాదవులు, కాపులు ఎక్కువ. బీసీల ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ. అయినా ఎక్కడో క్రిష్ణా జిల్లాకు చెందిన ఓసీ అయిన వెలగపూడి విశాఖ తూర్పులో వరసగా గెలుస్తున్నారు అంటే ఆయన అంతలా తమ రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు అని అంటారు. అలాంటి వెలగపూడి మీద ప్రతీ ఎన్నికకూ ఒక అభ్యర్ధి వంతున వైసీపీ మార్చుకుంటూ పోతోంది.
తొలిసారి 2014లో వైసీపీ నుంచి వంశీ క్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయారు. 2019 నాటికి చివరి నిముషంలో భీమిలీ నుంచి షిఫ్ట్ చేసి తీసుకుని వచ్చిన మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలను పోటీకి పెట్టారు. ఆమెని సైతం పాతిక వేల ఓట్ల తేడాతో వెలగపూడి ఓడించారు. ఇక ఓడిన నాటి నుంచి విజయనిర్మల తూర్పు వైసీపీ ఇంచార్జిగా ఉంటూ వస్తున్నారు.
టికెట్ తనకే ఖాయమని కూడా ఆమె ధీమాగా ఉన్నారు. అయితే ఒక్కసారిగా విశాఖ తూర్పు వైసీపీ ఇంచార్జి ఎంవీవీ అని పేర్కొనడంతో ఆమె వర్గం షాక్ తిన్నది. మరో వైపు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మర్యాద చేసినా వంశీ క్రిష్ణ యాదవ్ కి 2024లో వైసీపీ తరఫున తూర్పు నుంచి పోటీ చేయాలని ఉంది. ఆయనకంటూ విశాఖ తూర్పులో ఒక బలమైన వర్గం ఉంది.
దాంతో ఆయన ఆశలు కూడా తాజా పరిణామంతో వమ్ము అయ్యాయని అంటున్నారు. అందుకే ఎంవీవీ బాధ్యతలు తీసుకుని గడప గడపకూ తూర్పులో నిర్వహించిన కార్యక్రమానికి ఈ రెండు వర్గాలూ రాలేదని అంటున్నారు. ఎంవీవీ నియామకంతో ఒక్కసారిగా అసమ్మతి తూర్పులో పురి విప్పిందని అంటున్నారు. యాదవ సమాజికవర్గానికి చెందిన వంశీ, విజయనిర్మల వర్గాలు ఒక్కటిగా నిలిచి ఎంవీవీకి సహకరించకపోతే మాత్రం 2024 ఎన్నికల్లో ఆయనకు ఇబ్బందే అని అంటున్నారు
ఒక వైపు బలమీన అభ్యర్ధిగా ఉన్న వెలగపూడిని ఎదుర్కోవాలి. మరో వైపు సొంత పార్టీలో వర్గాలను ఏకం చేసుకుని అంతా తనకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఇది నిజంగా ఎంవీవీకి బిగ్ టాస్క్ అని అంటున్నారు. ఆయన ఎంపీగా నాలుగేళ్ల కాలంలో విశాఖకు చేసింది ఏదీ లేదని ఒక పక్కన విమర్శలు ఉన్నాయి. ఈసారి అందుకే టికెట్ ఇవ్వడంలేదు అని అంటున్నారు.
మరి అదే విశాఖ ఎంపీ పరిధిలోని హార్ట్ ఆఫ్ ది సిటీగా ఉన్న విశాఖ తూర్పు నుంచి ఎమెంల్యేగా పోటీ చేసి గెలవడం అంటే ఒక పెను సవాల్ గానే చూడాలని అంటున్నారు. మొత్తానికి ఎంపీ ఎంవీవీ వైసీపీ అధినాయకత్వం మీద వత్తిడి తెచ్చి విశాఖ తూర్పు సీటుని ఖాయం చేసుకున్నారు కానీ తూర్పులో మార్పు తీసుకుని వచ్చి వైసీపీని గెలిపించడం తాను గెలవడం అన్నది ఒక విధంగా అగ్ని పరీక్షగానే ఉంటుందని అంటున్నారు. టీడీపీ గెలుస్తుంది అని కళ్ళు మూసుకుని చెప్పే సీట్లలో ఒకటిగా ఉన్న విశాఖ తూర్పులో ఎంపీ ఎంవీవీ ఏం చేయబోతారు అన్నదే ఇపుడు ఆసక్తిని రేపుతున్న విషయం.