Begin typing your search above and press return to search.

వైసీపీ ఆ పని చేయడం మరచిపోయిందా ?

వైసీపీ ఒక రాజకీయ పార్టీ. కానీ ఆ స్వరూప స్వభావాలను ఆచరణలో చూపించడంలో విఫలం అవుతోందా అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   30 July 2024 1:30 PM GMT
వైసీపీ  ఆ పని చేయడం మరచిపోయిందా ?
X

వైసీపీ ఒక రాజకీయ పార్టీ. కానీ ఆ స్వరూప స్వభావాలను ఆచరణలో చూపించడంలో విఫలం అవుతోందా అన్న చర్చ సాగుతోంది. సాధారణంగా రాజకీయ పార్టీ అనగానే సభ్యత్వాలు ఉండాలి. క్యాడర్ బలంగా ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుంది.

వైసీపీ విషయం తీసుకుంటే 2011లో ఏర్పడింది. మొదట్లో ఏమైనా సభ్యత్వాలు నమోదు చేశారో ఏమో తెలియదు కానీ ఆ తరువాత మాత్రం చేసినట్లు అయితే కనిపించడం లేదని అంటున్నారు. పార్టీ సభ్యత్వం ఒక స్పెషల్ డ్రైవ్ గా జనసేన చేస్తోంది. తాజాగా జనసేన సభ్యత్వ నమోదు చూస్తే పది లక్షల దాకా సభ్యులను చేర్చుకుంది. ఇది రికార్డుగానే చెప్పాలి.

ఒక చిన్న పార్టీగా పుట్టి ఈ రోజు తనదైన రాజకీయ వ్యూహాలతో అధికార కూటమిలో ముఖ్య భాగస్వామిగా మారిన జనసేన తన పార్టీని మరింతగా పటిష్టం చేసుకోవాలని అనుకుంటోంది. ఇది మంచి పరిణామం గానే చూడాలి ఏ రాజకీయ పార్టీకి అయినా క్యాడర్ చాలా ముఖ్యం.

జనసేనకు పవన్ ద్వారా వచ్చిన సినీ అభిమానం జనం. అలాగే ఆ పార్టీకి ఒక బలమైన సామాజిక వర్గం దన్ను ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యాడర్ గా మారితేనే పార్టీ మరింతగా బలపడుతుంది. ఇపుడు జనసేన అదే పని చేస్తోంది. టీడీపీ విషయం తీసుకుంటే క్రమం తప్పకుండా ప్రతీ రెండేళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు చేపడతారు.

ప్రాంతీయ పార్టీలలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా టీడీపీకి రికార్డు ఉంది. అరవై నుంచి డెబ్బై లక్షల సభ్యత్వమా పార్టీకి ఉందని చెబుతారు. మరి వైసీపీ ఏర్పాటు చేసి పదమూడేళ్లు అయింది. సభ్యత్వ నమోదుని ఆ పార్టీ కూడా గట్టిగా చేయాలి కదా అన్న చర్చ వస్తోంది.

వైసీపీకి ఎంత మంది సభ్యులు ఉన్నారు వారిలో క్రియాశీల సభ్యులు ఎంతమంది సాధారణ సభ్యులు ఎంతమంది అన్నది కూడా తెలియాలి కదా అని అంటున్నారు. వైసీపీ అయిదేళ్ల పాటు అధికారంలో ఉంది. ఆ కాలంలో సభ్యత్వం మీద పెద్దగా దృష్టి పెట్టింది లేదని అంటున్నారు.

ఇక వైసీపీ 2017లో ఒకసారి పార్టీ ప్లీనరీ నిర్వహించింది. మళ్లీ 2022లో నిర్వహించింది. ప్రతీ అయిదేళ్ళకు అలా నిర్వహిస్తామని చెబుతోంది. ఇది ఆ పార్టీ రాజ్యాంగం ప్రకారం చూసుకున్నా పార్టీ సభ్యత్వ నమోదు బూత్ లెవెల్ నుంచి జరగాలి కదా అని అంటున్నారు. అలా సభ్యత్వ నమోదు చేసిన తరువాత బూత్ లెవెల్ నుంచి పార్టీ నిర్మాణం చేపట్టి పదవుల పంపిణీ చేపట్టాల్సి ఉందని అంటున్నారు.

అది అలా రాష్ట్ర స్థాయి దాకా ఉండాలని పార్టీ కార్యవర్గాలు నిర్మాణం చేసుకుంటూ ఎక్కడికక్కడ కొత్త నీరుని కొత్త ముఖాలను తెచ్చి పార్టీలో కీలకమైన స్థానాలు అప్పగిస్తేనే పార్టీ ఎప్పటికపుడు నిత్య నూతనంగా ఉంటుందని అంటున్నారు.

వైసీపీలో అయితే పార్టీ సమావేశాలు జరిగిన దాఖలాలు ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. పార్టీని ఇప్పటికైనా గాడిన పెట్టాలంటే ముందుగా సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆ మీదట పార్టీని జనంలో ఉంచాలని అంటున్నారు. వైసీపీ పార్టీ సభ్యత్వాల మీద అసలు దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. ఈ విషయంలో జగన్ ఏమి చేస్తారో చూడాల్సి ఉందని అంటున్నారు.