ఢిల్లీ ఆర్డినెన్స్ ను గట్టెక్కించనున్న వైసీపీ..
మరోవైపు ఢిల్లీ పాలనా యంత్రాంగంపై అధికారం విషయంలో కొన్నాళ్లుగా వివాదం రేగుతోంది
By: Tupaki Desk | 27 July 2023 11:00 AM GMTఅసలే ''ఇండియా'' కూటమి కట్టింది.. దీనికితోడు మణిపుర్ అల్లర్లు.. పార్లమెంటు కొత్త భవనంలో తొలిసారిగా ప్రారంభమైన సమావేశాలను కుదిపేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికల ఏడాదిలో కీలక బిల్లులను నెగ్గించుకోవాలనే పట్టుదలలో ఉంది. ఇలాంటివాటిలో కీలకమైనది ఢిల్లీ ఆర్డినెన్స్. ఆ బిల్లు వర్షాకాల సమావేశాల్లో గట్టెక్కుతుందా? లేదా? అనేది బలమైన సందేహంగా ఉంది. రాజ్యసభలో బీజేపీకి బలం లేనందున అత్యంత వివాదాస్పద ఈ ఆర్డినెన్స్ పాసవడం కష్టమే అనుకున్నారు. కానీ, గట్టెక్కే వీలు కలిగింది.
ఢిల్లీ రాష్ట్రమే అయినా.. పూర్తి అధికారాలు అక్కడి ప్రభుత్వానికి ఉండవు. దేశ రాజధాని కావడంతో కేంద్ర ప్రభుత్వం పాత్ర తప్పనిసరి. అయితే, కొన్నేళ్లుగా ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదాలో ఉంది. రెండు టర్మ్ లుగా ఆప్ గెలుస్తోంది. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆ పార్టీ ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేజ్రీ దారిలోకి రాలేదు. సరికదా.. ప్రతిపక్ష కూటమిలో చేరారు.
మరోవైపు ఢిల్లీ పాలనా యంత్రాంగంపై అధికారం విషయంలో కొన్నాళ్లుగా వివాదం రేగుతోంది. కేంద్ర నియమించిన ఎల్జీ, ప్రజలు ఎన్నుకున్న కేజ్రీ ప్రభుత్వం తరచూ తలపడుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ యంత్రాంగంపై పట్టు సాధించేలా ఆర్డినెన్స్ తెచ్చింది. కానీ, ఎన్నికైన ప్రభుత్వానికే యంత్రాంగంపై అధికారం ఉంటుందంటూ దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, ఢిల్లీ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడు ఈ బిల్లును పాస్ చేయించడంలో ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కీలకంగా నిలవనుంది.
నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీకి వైసీపీ పలుసార్లు పార్లమెంటులో ఓటింగ్ సందర్భంగా అండగా నిలిచిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాల ప్రాతిపదికన కేంద్రానికి సహకారం అందించామని వైసీపీ ప్రభుత్వం చెప్పేది. కాగా, ఢిల్లీ బిల్లు విషయంలోనూ కేంద్రానికి ఆ పార్టీ మద్దతు ఖాయమైంది. దీంతోపాటు మణిపూర్ పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలోనూ వైసీపీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఓటు వేయనున్నట్లు స్పష్టమవుతోంది.
వైసీపీకి రాజ్యసభలో 9 మంది సభ్యులున్నారు. లోక్ సభలో రఘురామ క్రిష్ణంరాజును కలపకుండా చూస్తే 22 మంది ఎంపీలున్నారు. కాగా, బీజేపీకి రాజ్య సభలో తగిన బలం లేదు. దీంతో బీజేపీకి వైసీపీ మద్దతు అవసరం పడుతోంది. అడిగిన వెంటనే వైసీపీ సైతం ఓటు వేస్తోంది. కాగా, ఢిల్లీ ఆర్డినెన్స్, అవిశ్వాసం విషయంలో కేంద్రానికి అండగా నిలవాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం. మద్దతుపై తేల్చిచెప్పిన విజయసాయి..
ఢిల్లీ ఆర్డినెన్స్, అవిశ్వాసంపై కేంద్రానికి మద్దతుగా ఓటు వేస్తామని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి జాతీయ మీడియాకు చెప్పారు. ఈ నిర్ణయంతో బీజేపీ సర్కారు అవిశ్వాసాన్ని మంచి మెజార్టీతో ఓడించే అవకాశం కలగనుంది. కాగా, సరిగ్గా ఐదేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. 2018 జూలై 20న, ఇప్పుడు జూలై 26న తీర్మానాన్ని ప్రతిపాదించాయి. మణిపూర్ విషయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న ప్రతిపక్షానికి ఢిల్లీ బిల్లు రూపంలో కేంద్రం పంచ్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.
ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దేశమంతటా పర్యటించారు. వివిధ పార్టీల మద్దతు కూడగట్టారు. అంతేగాక ఇండియా కూటమి భేటీకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో తమకు మద్దతు తెలపాలని పట్టుబట్టి మరీ సాధించారు. ఇక ఇప్పుడేం చేస్తారో చూడాలి.
ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. ఏదైనా బిల్లు గట్టెక్కాలంటే 120 మంది మద్దతు అవసరం. బీజేపీ 105 మంది సభ్యులే ఉన్నారు. ఐదుగురు నామినేటెడ్ సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు తమకే మద్దతిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. వీరిని కలుపుకొంటే 112 మంది అవుతారు. మెజారిటీకి 8 తక్కువ. ఇక్కడే వైసీపీ మద్దతు కీలకమైంది. ఆ పార్టీకి ఉన్న 9 మంది సభ్యుల మద్దతుతో మోదీ ప్రభుత్వం రాజ్యసభలో బిల్లులను గట్టెక్కించుకోగలదు. కాగా, ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా 105 మంది ప్రతిపక్ష సభ్యులు ఓటేసే అవకాశం ఉంది.