జగన్ దారిలోనే బాబు.. ఇలా చేయకుండా ఉండాల్సింది!
అయితే.. నదుల పక్కన నిర్మాణాలు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ.. జగన్ సర్కారు వచ్చిన తొలి వారంలోనే దీనిని కూల్చేసింది.
By: Tupaki Desk | 22 Jun 2024 6:25 AM GMTవైసీపీ అధినేత జగన్ దారిలోనే టీడీపీ కూటమి పార్టీల ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పయనిస్తున్నా రా? 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. కృష్ణానది ఒడ్డున నిర్మించిన ప్రజావేదికను కూల్చేశారు. ఇది ప్రభుత్వ ధనం రూ.8 కోట్లతో చేపట్టిన నిర్మాణం. ప్రజల తరఫున గళం వినిపించేందుకు.. అధికారులతో సమావేశాలు నిర్వహించుకునేందుకు చంద్రబాబు సర్కారు గతంలో నిర్మించింది. అందుకే దీనికి ప్రజావేదిక అని పేరు పెట్టింది.
అయితే.. నదుల పక్కన నిర్మాణాలు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ.. జగన్ సర్కారు వచ్చిన తొలి వారంలోనే దీనిని కూల్చేసింది. ఐఏఎస్, ఐపీఎస్‌లతో మీటింగ్ పెట్టి మరీ.. జగన్ దీనిని కూల్చేస్తున్నట్టు ప్రకటించిన గంటల వ్యవధిలోనే దీనిని నేలమట్టం చేశారు. దీంతో జగన్‌పై `విధ్వంసకారుడు` అనే ము ద్ర వేశారు. ఎన్నికల సమయంలోనూ ప్రచారం చేసుకున్నారు. కనీసం దీనిపై ప్రజల్లో చర్చ పెట్టలేదని.. గత ప్రభుత్వం నిర్మించిన నేపథ్యంలో అప్పటి అదికారులను వివరణ కూడా కోరలేదని అప్పట్లోనే.. చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
`కూల్చివేతలతో` జగన్ పాలన ప్రారంభించారని కూడా చంద్రబాబు సహా టీడీపీ నాయకులు దుయ్యబట్టా రు. ఈ మచ్చ ఎన్నికల వరకు సాగింది. అంతేకాదు.. ఆ శిధిలాలను కూడా.. తొలగించబోమని రెండు రోజుల కిందట చంద్రబాబు చెప్పుకొచ్చారు. విధ్వంస పాలనకు అది గుర్తుగా ఉండాలన్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు చంద్రబాబు చేసింది కూడా అలానే ఉంది. అయితే.. అది ప్రజల అవసరాల కోసం.. నిబంధన లు తోసిపుచ్చి నిర్మించారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా.. నిబంధ నల పేరుతోనే తొలగించారు.
వాస్తవానికి అప్పట్లో చేసిన కూల్చివేత కంటే కూడా.. ఇప్పుడు చేసింది రాజకీయంగా తీవ్ర ఉద్రికత్తలకు, వ్యక్తిగత కక్షలకు దారితీసే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఒక పార్టీకి చెందిన కార్యాలయం అయినప్పుడు ముందుగా సదరు పార్టీని వివరణ కోరాలి. సంప్రదింపులు జరపాలి. ఎందుకంటే.. విజ్ఞత ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అందరూ అంటున్నారు కనుక. పద్ధతైన ప్రభుత్వం వచ్చిందని డప్పు కొట్టుకుంటున్నారు కనుక. కానీ, ఇలాంటివి ఏమీ జరగలేదు. ఓ వారం పాటు టైం ఇస్తే..చంద్రబాబుకు కానీ.. ప్రభుత్వానికి కానీ, పోయేది ఏమీలేదు.
అంతేకాదు.. ఈ నిర్మాణాన్ని కూడా.. విశాఖ రుషి కొండ నిర్మాణం మాదిరిగా మీడియాకు చూపించి.. ప్రజల్లో చర్చ పెట్టి... జగన్‌ను అక్రమార్కుడు అని మరో ముద్ర వేసిన తర్వాత.. కూల్చేయొచ్చు. లేదా.. న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ.. విజ్ఞత ఉన్న ముఖ్యమంత్రి కూడా.. దారి తప్పేసి.. తన పాలనను కూడా కూల్చివేతలతోనే ప్రారంభించడం.. అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఇలా అయితే.. ఈ రాష్ట్రం మున్ముందు.. రావణ కాష్టమే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రేపు వైసీపీ అధికారంలోకి రాదని గ్యారెంటీ ఏమైనా ఉందా? అప్పుటు టీడీపీ కార్యాలయాలకు.. నేతల ఇళ్లకు ముప్పు రాదా? ఒకరు తప్పు చేశారని.. చెబుతున్న మేధావులు.. విజ్ఞులు.. తాము కూడా.. అదే దారిలో నడుస్తూ.. తప్పులు చేస్తే.. రేపు ఇబ్బంది పడాల్సింది.. శాంతి భద్రతల సమస్యను ఎదుర్కొనాల్సింది.. ప్రజల న్న విషయాన్ని నాయకులు మరిచిపోతున్నారా? అనేది ప్రశ్న.