Begin typing your search above and press return to search.

నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీస్ కూల్చివేత... జగన్ రియాక్షన్ వైరల్!

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 Jun 2024 4:39 AM GMT
నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీస్  కూల్చివేత... జగన్  రియాక్షన్  వైరల్!
X

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

అవును... గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలోని వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. బోటు యార్డుగా వినియోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్ అప్పగించిందని ఆరోపిస్తూ.. ఈ కూల్చివేత కార్యక్రమాలు చేపట్టారని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ నిర్మాణంపై వైసీపీకి సీఆర్డీయే నోటీసులు జారీ చేసిందని అంటున్నారు.

అయితే ఈ భవనాల కూల్చివేత వ్యవహారంపై శుక్రవారమే వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే చట్ట నిబంధనలను ఉల్లంఘించి కార్యాలయ నిర్మాణాలను కూల్చివేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు వైసీపీ చెబుతోంది. ఇదే విషయాన్ని సీఆర్డీయే కమిషనర్‌ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారని అంటున్నారు.

అయితే... ఆ ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా సీఆర్డీయే కూల్చివేత కార్యక్రమాన్ని ముగించిందని అంటున్నారు. దీంతో... హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ కూల్చివేత జరిపారని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, పైగా ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, కచ్చితంగా హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది.

ఇందులో భాగంగా... శనివారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. కేవలం రెండు గంటల్లోనే ఈ కూల్చివేత కార్యక్రమం పూర్తయ్యిందని అంటున్నారు. ఇదే సమయంలో... వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు భారీగా మొహరించారు.

ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు.. తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని ఆన్ లైన్ వేదికగా మండిపడ్డారు. ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరారు!

ఈ సందర్భంగా... "ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి" అని జగన్ అన్నారు.

ఇదే సమయంలో.. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని చెప్పిన జగన్... ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్సీపీ తలొగ్గేది లేదని.. వెన్నుచూపేది అంతకన్నా లేదని స్పష్టం చేశారు.

ఈ సమయంలో... ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులుపెట్టినా ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజల తోడుగా గట్టిపోరాటాలు చేస్తామని జగన్ క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా... దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు చేస్తున్న దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నట్లు జగన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. మరోపక్క సూపర్ - 6 హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రయత్నాలని వైసీపీ చెబుతోంది!