ఇట్స్ అఫీషియల్.. వైసీపీ ఫస్ట్ వికెట్ డౌన్!
వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పార్టీ అభ్యర్థుల స్థానాల్లో పలు మార్పులు చేశారు.
By: Tupaki Desk | 22 Jan 2024 3:30 AM GMTవచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పార్టీ అభ్యర్థుల స్థానాల్లో పలు మార్పులు చేశారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా మంగళగిరి స్థానాన్ని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి నిరాకరించడంతో ఆయన ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని వెల్లడించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఆమెతోపాటు తాను కూడా చేరతానని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చానని.. ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్తున్నానని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ అధికారికంగా వేరే పార్టీలో చేరిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. షర్మిల.. ఆర్కేకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం ముందు నుంచి ఉందని, ఆ పార్టీకి సంస్థాగతంగా బలమైన కార్యవర్గం ఉందని ఎమ్మెల్యే ఆళ్ల గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విధానాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు.
అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వ లోపాలను కూడా తాను ఎండగడతానని ఎమ్మెల్యే ఆళ్ల హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో తనకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక మంది పనిచేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. తాను పార్టీలో కొత్తగా చేరుతున్నానని.. సీనియర్లు తన ముందు వరుసలో ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
కాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తొలిసారి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంజి చిరంజీవిపై ఆర్కే విజయం సాధించారు. ఇక 2019లో మరోసారి వైసీపీ తరఫున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పై 5 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు.
అయితే వచ్చే ఎన్నికల్లో ఆర్కేకు వైఎస్ జగన్ సీటు నిరాకరించారు. ఈ సీటును చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవికి కేటాయించారు. టీడీపీకి రాజీనామా చేసిన గంజి చిరంజీవి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.