రాజ్యసభ ఎన్నికల కోసం వైసీపీ పక్కా వ్యూహం...!
వైసీపీ ఈ ఏడాది మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లను గెలుచుకోవడానికి సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 24 Jan 2024 3:48 AM GMTవైసీపీ ఈ ఏడాది మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లను గెలుచుకోవడానికి సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది అని అంటున్నారు. మామూలుగా అయితే వైసీపీకి విజయం నల్లేరు మీద నడక అని అంటున్నారు. కానీ వైసీపీ ముందుగానే ఎమ్మెల్యేల అభ్యర్ధుల లిస్ట్ రెడీ చేస్తోంది
దాంతో చాలా చోట్ల వైసీపీకి కొత్త ఇంచార్జులు వస్తున్నారు. అదే విధంగా సిట్టింగులు కొందరికి సీట్లు లేకుండా పోతున్నాయి. ఈ నేపధ్యంలో చాలామందికి సీటు బెంగ ఉంది. అలాగే సీటు రాని వారు వేరే చోటకు పోతున్నారు. కొందరు రాజీనామా చేశారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి అయితే కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆయన మాదిరిగానే అనంతపురం జిల్లాకు చెందిన కాపు రామచంద్రారెడ్డి కూడా వైసీపీకి దూరం అయ్యారు. క్రిష్ణా జిల్లాకు చెందిన పార్ధసారధి, అలాగే రక్షణ్ నిధి వంటి ఎమ్మెల్యేలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలది అదే ఆలోచన అని అంటున్నారు
మొత్తం మీద చూస్తే వైసీపీని వీడిన వారు కొందరు అయితే పార్టీలో ఉంటూ అసంతృప్తితో ఉన్న వారి లెక్క అయితే తెలియదు. దాంతో మార్చిలో జరిగే రాజ్య సభ ఎన్నికల విషయంలో వైసీపీ సీరియస్ గా ఆలోచిస్తోంది అని అంటున్నారు.
ఇక ఇపుడు చూస్తే వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో నలుగురు ఎమ్మెల్యేలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే వైసీపీకి టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల మద్దతుతో పాటు జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే మద్దతు కూడా ఉంది దాంతో 152 మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉన్నట్లు లెక్క. అయితే ఇందులో కూడా చూస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పార్ధసారధి వంటి వారిని పక్కన పెడితే నంబర్ చాలా తగ్గిపోతుంది. ఇక విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా అయితే యాభై మంది దాకా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
ఆ నంబర్ మీద ఆశతోనే ఈసారి తప్పనిసరిగా పోటీ చేయాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. ఇక ఈ దఫాలో జరిగే చివరి రాజ్యసభ ఎన్నికలు కావడం తమ పదవీ కాలం చివరిలో ఇదొక సువర్ణ అవకాశంగా ఎమ్మెల్యేలు అంతా భావిస్తున్నారు. టీడీపీ నుంచి ఒక్క సీటు పోటీకి బిగ్ షాట్స్ రెడీ అవుతున్నారు అని అంటున్నారు.
దాంతో లేట్ గా అయినా లేటెస్ట్ గా వైసీపీ మేలుకుంది అని అంటున్నారు. ఆ పార్టీ తొలి వేటు వేసింది మాజీ మంత్రి టీడీపీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు మీదనే. ఆయన్ని మాజీని చేసేశారు. ఇక అంతే కాకుండా వైసీపీ సస్పెండ్ చేసిన మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు అని అంటున్నారు.
అదే విధంగా టీడీపీ ఫిర్యాదు మేరకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీకి మద్దతు ఇచ్చిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ కుమార్, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ లకు కూడా నోటీసులు ఇష్యూ చేశారు. వీరంతా వారం రోజుల వ్యవధిలో తమ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి వీరి మీద యాక్షన్ తీసుకుంటారు అని అంటున్నారు.
అయితే స్పీకర్ సంతృప్తి చెందితే ఆయా ఎమ్మెల్యేల మీద యాక్షన్ ఉండదు, అలా కాకపోతే యాక్షన్ ఉండొచ్చు. అంటే వైసీపీకి మద్దతు ఇచ్చిన వారి మీద చర్యలు ఉండకపోవచ్చు అని అంటున్నారు. అదే టైం లో టీడీపీకి జై కొట్టిన నలుగురు ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకుంటే మాత్రం టీడీపీకి అసలు నంబర్ 18 వద్దకే ఆగిపోతుంది. దాంతో పాటు టికెట్లు రాక టీడీపీ వైపు వెళ్ళి కండువా ఎవరైనా కప్పుకున్న లేక వేరే పార్టీలో చేరినా వారి మీద స్పీకర్ వేటు వేసే చాన్స్ ఉంటుంది. మొత్తానికి తమ బలాన్ని అలాగే ఉంచుకుని మూడు సీట్లను గెలిచేందుకు వైసీపీ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోందని అంటున్నారు.