Begin typing your search above and press return to search.

విపక్షం హడావుడి : వైసీపీ ధీమా అదేనా...!?

ఇంతకీ వైసీపీ ధీమాకు కారణం ఏంటి అంటే సంక్షేమ పధకాలే. అలాగే హామీలు తుచ తప్పకుండా అమలు చేయడం.

By:  Tupaki Desk   |   27 Dec 2023 3:54 AM GMT
విపక్షం హడావుడి :  వైసీపీ ధీమా అదేనా...!?
X

విపక్షంలో హడావుడి పడుతోంది. రోజుకొక కొత్త రకం ప్రయోగాలు చేస్తోంది. తాను తిట్టిన వారినే అక్కున చేర్చుకుంటోంది. పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ ని తెచ్చి పెట్టుకుని సంబరపడుతోంది టీడీపీ. పీకే 2019లో వైసీపీని గెలిపించారు, ఇపుడు టీడీపీని గెలిపిస్తారు అని తమ్ముళ్ళు అంటున్నారు ఇక పవన్ తో పొత్తు ఉంది. దీనికి మరిన్ని పొత్తులు జత చేసి మహాకూటమికి తెర తీయాలని టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తున్నారు.

కుదిరితే బీజేపీతో లేకపోతే కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో కలసి వెళ్లాలని చూస్తున్నారు. ఇంకో వైపు వైసీపీలో టికెట్లు దక్కని వారిని తమ వైపునకు తిప్పుకుని టీడీపీ బలం పెరిగిందని చెప్పుకోవాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇలా రాజకీయంగా ఇన్ని జరుగుతున్నా నిండు కుండలా వైసీపీ ఉంది.

ఆ పార్టీ అధినేత జగన్ రిలాక్స్డ్ గా ఉన్నారు. ఆయన మూడు రోజుల పాటు తన సొంత జిల్లా కడపలో పర్యటించారు. క్రిస్మస్ వేడుకలలో పాలు పంచుకున్నారు. అదే విధంగా గుంటూరులో ఆడుదాం ఆంధ్రా పోటీలను ప్రారంబించారు. సరదాగా బ్యాటింగ్ చేశారు. అదే తమ నేత పొలిటికల్ బ్యాటింగ్ అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇంకో వైపు వై నాట్ 175 సీట్స్ అని జగన్ పాత వారి స్థానంలో కొత్త ముఖాలకు చాన్స్ ఇస్తున్నారు. పనిచేయని వారిని పక్కన పెట్టేస్తున్నారు. ఇందులొ నో రాజీ, నో మొహమాటం అని కూడా చెప్పేస్తున్నారు. అలా పక్కన పెట్టిన వారికి అవకాశాలు ఇస్తామని చెబుతున్నారు. విన్న వారు ఉంటున్నారు. లేని వారి పక్క చూపులు చూస్తున్నారు. అయినా సరే జగన్ దూకుడుగానే ముందుకు సాగుతున్నారు.

ఇక రాజకీయ విశ్లేషకుడి అవతారం ఎత్తిన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు ఇలా అభ్యర్ధులను మార్చడం రిస్క్ అని అంటున్నారు. అయినా జగన్ చేసుకుని పోతున్నారు. ఆయన పొలిటికల్ గా ట్రెండ్ సెట్టర్ గా ఉంటూ వస్తున్నారు. రొటీన్ పాలిటిక్స్ కి భిన్నంగా వెళ్తున్నారు. అందువల్ల జగన్ చేస్తున్న ప్రయోగాల మీద ట్రెడిషనల్ పొలిటీషియన్స్ చూసే చూపు మాట్లాడే మాటలు చేసే కామెంట్స్ కొలమానం అవుతాయా అంటే కావు అనే అంటున్నారు.

సో జగన్ లో ఏదో నమ్మకం ధీమా ఉన్నాయి. లేకపోతే ఆయన ఇలా చేయరు. అందుకే ఆయన ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు. ఇంతకీ వైసీపీ ధీమాకు కారణం ఏంటి అంటే సంక్షేమ పధకాలే. అలాగే హామీలు తుచ తప్పకుండా అమలు చేయడం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, సైలెంట్ గా పనిచేసుకుని పోవడం.

ఈ రోజుకు కూడా విపక్షాలు ఆల్టర్నేషన్ పాలిటిక్స్ ని అమలు చేయలేకపోవడం వైసీపీకి ప్లస్ అవుతోంది అని అంటున్నారు. జగన్ ఇచ్చిన పధకాల కంటే రెట్టింపు ఇస్తామని చెప్పడం ద్వారా వైసీపీ చేసింది భేష్ అని విపక్షలే కితాబు ఇవ్వడమే అతి పెద్ద సక్సెస్ అంటున్నారు. అదే విధంగా సోషల్ ఇంజనీరింగ్ లోనూ వైసీపీ ముందుంది. కొత్త ముఖాలకు చాన్స్ ఇవ్వడం కానీ, యువతకు అవకాశాలు పెంచడంలో కానీ వైసీపీ కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తోంది.

ఇక సర్వేలు చూస్తే కోస్తా జిల్లాలలో ఈ రోజుకీ వైసీపీ గ్రాఫ్ చాలానే ఉంది. విపక్షాలు అందనంత ఎత్తున ఉంది అంటున్నారు. మొత్తం 101 సీట్లు ఉన్న కోస్తా జిల్లాలలో వైసీపీ ఓటు షేర్ యాభై శాతం ఉంటే టీడీపీకి 35 శాతం, జనసేనకు 10 శాతం, ఇతర పార్టీలకు మూడు శాతం ఓట్ షేర్ ఉందని ఆ పార్టీ చేయించుకున్న విశ్వసనీయ సర్వేలు చెబుతున్నాయట.

ఇక గ్రేటర్ రాయలసీమలో ఉంటే 74 సీట్లలో వైసీపీ హవాయే ఎక్కువగా ఉంది. దాంతో ఎటు నుంచి ఏమి జరిగినా వైసీపీ మళ్లీ కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు. ఈ రకమైన సర్వే ఫలితాలను చూసే వైసీపీ అధినాయకత్వం దూకుడుగా ముందుకు సాగుతోందని అంటున్నారు. అలాగే ధీమాగానూ ఉంది. మొత్తానికి ఓటమి తమకు లేదు అన్న విశ్వాసంతో వైసీపీ ఉంటే పొత్తులు ఎత్తులతో విపక్ష శిబిరం ఉంది. అలా చూస్తున్న ఏపీలోని కోట్లాది ఓటర్లకు సగటు జనాలకు ఈ రాజకీయ చిత్రమే ఏ పార్టీ సంగతేంటి అన్నదాని మీద ఒక కీలక సంకేతం పంపిస్తోంది అని అంటున్నారు.