సరికొత్త చరిత్ర... వైసీపీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం!
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, కీలక నేత సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
By: Tupaki Desk | 20 Feb 2024 1:05 PM GMTగతకొన్ని రోజులుగా ఏపీలో రాజ్యసభ ఎన్నికపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రబాబు టీడీపీ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలెబెడతారా లేద అనే చర్చ బలంగా సాగింది. ఒకానొక దశలో... వైసీపీ నుంచి సుమారు పాతికమందికి పైగా తమతో టచ్ లో ఉన్నారని.. వారంతా టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తారనే డైలాగులు టీడీపీ నుంచి వినిపించాయి! దీంతో... చంద్రబాబు ఏదైనా మ్యాజిక్ చేయబోతున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ సమయంలో స్పీకర్ ఎంట్రీ ఇచ్చారు. పార్టీ మారినవారిపై చర్యలకు ఉపక్రమించారు! కారణం ఏదైనా... చంద్రబాబు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలబడటం లేదని స్పష్టం చేశారు! దీంతో చంద్రబాబు వాస్తవాన్ని గ్రహించారనే కామెంట్లు వినిపించాయి. దీంతో... రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని మూడు రాజ్యసభ స్థానాలను అధికార వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది.
అవును... వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి లు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు వేసిన నేపథ్యంలో తాజాగా వీరి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది! దీంతో ఈ మూడు స్థానాల గెలుపుతో.. రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరుకుంది. ఈ సమయంలో ఇలా ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన రాజ్యసభ సభ్యులకు ఎన్నికల అధికారులు ధృవ పత్రాలను అందించనున్నారు.
కాగా... తాజాగా జరిగిన ఎన్నికలతో రాజ్యసభలో తెలుగుదేశం ప్రాతినిథ్యం శూన్యానికి పడిపోయిన సంగతి తెలిసిందే! పార్టీ ఏర్పడిన సుమారు 41 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నేతృత్వంలో రాజ్యసభలో టీడీపీ సభ్యులు లేని పరిస్థితి వచ్చింది! దీంతో ఇది సరికొత్త చరిత్ర అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక:
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, కీలక నేత సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయ్ బరేలీ స్థానం నుంచి లోక్ సభకు 6 పర్యాయాలు ఎంపికైన సోనియా గాంధీ.. తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. సోనియా గాంధీ ఫిబ్రవరి 15న రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ లో 10 రాజ్యసభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ కు 6, బీజేపీకి 4 దక్కాయి.