ప్రజల కోసం.. ప్రజల చేత.. ప్రజల వలన.. : వైసీపీ మాస్టర్ ప్లాన్
2024లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏపీ అధికార పార్టీ వైసీపీ పక్కా క్లారి టీతో ఉందని తెలుస్తోంది
By: Tupaki Desk | 25 Dec 2023 9:31 AM GMT2024లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏపీ అధికార పార్టీ వైసీపీ పక్కా క్లారి టీతో ఉందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలు సహజంగా ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలే అయినప్పటికీ.. వైసీపీ ఆ కోణంలో ఎక్కడా చూడడం లేదు. నిజానికి ప్రతి ఐదేళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుంటాయి. రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియే.
ఈ క్రమంలో అధికార పక్షంపై పైచేయి సాధించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తాయి. ఏదో ఆ ఎన్నికలకు నాలుగులేదా మూడు మాసాల ముందు మాత్రమే రాజకీయ వేడి ఉంటుంది. విమర్శలు.. ప్రతి విమర్శలు వస్తాయి. చివరకు ఆ వేడిఎన్నికలతో పరిసమాప్తం అయిపోతుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే. అయితే.. ఏపీలో గత 2019 ఎన్నికలను పరిశీలిస్తే.. వైసీపీ పాదయాత్రతో పాటు నవరత్నాలు అనే సరికొత్త కాన్సెప్టుతో ఎన్నికల గతిని మార్చేసింది.
సహజంగా ఏవో కీలకమైన నాలుగైదు పథకాలను ప్రకటించడం ఏ పార్టీ అయినా.. చేసేదే. కానీ, దీనికి భిన్నంగా.. విశ్వసనీయత, నమ్మకంతోపాటు నవరత్నాలు అనే కాన్సెప్టును వైసీపీ తెరమీదికి తెచ్చి 2019 లో ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఇక, కట్ చేస్తే.. ఇప్పుడు మరో మూడు మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరి ఇప్పుడు వైసీపీనే అధికారంలో ఉంది. కాబట్టి.. గత వ్యూహాన్నే అమలు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, 2024 ఎన్నికల ముఖచిత్రాన్ని కూడా వైసీపీ మార్చేసింది.
ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే అలెర్ట్ అయిపోయింది. నాయకులను ప్రజల మధ్యకు పంపించింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసింది. వలంటీర్లే వేగులుగా.. ప్రజల నాడిని పసిగడుతూ.. ఆరోగ్య శ్రీ వంటి కీలకమైన పథకాలను మరింత బలోపేతం చేసింది. ఎన్నికలకు మూడు మాసాల ముం దే.. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను పూర్తిగా నెరవేర్చింది. వైసీపీ ఇది ఎగ్గొట్టింది? అని చెప్పే పరిస్థితి లేకుండా చేసుకుంది. ఇక, 2019 మేనిఫెస్టోను ఆన్‌లైన్‌లో ఇప్పటికీ అందుబాటులో ఉంచింది.
స్పందన ద్వారా.. వచ్చే ఫిర్యాదులను వారంలోనే పరిష్కరిస్తోంది. ఇక, నాయకుల మార్పులు, చేర్పుల విషయంలోనూ.. ఎలాంటి తర్జన భర్జనలకు తావు లేకుండా.. ముందుకు సాగుతోంది. అంటే.. ఒక రకంగా చెప్పాలంటే.. 2024 ఎన్నికల ముఖ చిత్రాన్ని కూడా.. వైసీపీ మార్చేసిందనే చెప్పాలి. ప్రజల కోసం.. ప్రజల చేత.. ప్రజల వలన.. అన్న ప్రజాస్వామ్య పద్ధతికి పెద్ద పీట వేసింది. ఇదే.. విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెట్టించేలా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.