స్థాయీ ఎన్నికల్లో వైసీపీ హ్యండ్సప్ ?
విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ స్థాయీ సంఘం ఎన్నికలు ఎన్నడూ లేనంత వేడిని పెంచుతున్నాయి.
By: Tupaki Desk | 6 Aug 2024 3:51 AM GMTవిశాఖ మున్సిపల్ కార్పోరేషన్ స్థాయీ సంఘం ఎన్నికలు ఎన్నడూ లేనంత వేడిని పెంచుతున్నాయి. ఏడాది పాటు కాలపరిమితితో సాగే స్థాయి సంఘం పదవుల కోసం వైసీపీ టీడీపీ కూటమి నుంచి సరిసమానంగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 20 నామినేషన్లు దాఖలు అయినట్లుగా అధికారులు ప్రకటించారు.
స్థాయి సంఘం సభ్యులు అంతా కలసి స్టాండింగ్ కమిటీ చైర్మన్ ని ఎన్నుకుంటారు. జీవీఎంసీ పాలనలో స్టాండింగ్ కమిటీదే అతి ముఖ్య పాత్ర. దాంతో ముందుగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ మీదట మేయర్ పదవిని కూడా కైవశం చేసుకోవాలని కూటమి ఎత్తులు వేస్తోంది.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇపుడు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన స్థాయీ సంఘం ఎన్నికలను చాలా ప్రతిష్టగా తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో పదికి పది స్థానాలను కూటమి గెలుచుకోవాలని గంటా కోరారు. ఆయన కార్పోరేటర్లతో చర్చలు జరిపారు. ఎన్నికల వ్యూహాల మీద దిశా నిర్దేశం చేశారు.
యాభై మంది కార్పోరేటర్ల మద్దతు ఎవరి వైపు ఉంటే వారిదే విజయం. వైసీపీకి సంఖ్యా బలం బయటకు కనిపించినా వారిలో చాలా మంది కూటమి వైపుగా షిఫ్ట్ అయ్యారు. దాంతో నలభై మంది మాత్రమే నికరంగా వైసీపీకి ఉన్నారు. అయితే విజయవాడ కర్నూల్ కార్పొరేషన్ లలో ఎలా గెలిచామో అదే తీరున తాము జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లోనూ గెలిచి తీరుతామని ఆ పార్టీ చెబుతోంది.
కానీ వైసీపీలో స్థాయీ సంఘం ఎన్నికలను కో ఆర్డినేట్ చేసేవారు ముందుకు నడిపించేవారూ లేరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ తలమునకలై ఉన్నారు. గతంలో జీవీఎంసీ విషయంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఇపుడు సైలెంట్ అయ్యారు. విశాఖ సిటీలో వైసీపీకి ధీటైన నేతల కరవు మొదటి నుంచీ ఉంది.
దాంతోనే సరైన నాయకత్వం లేక చాలా మంది కార్పోరేటర్లు గోడ దూకి కూటమి వైపు చేరిపోయారు అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ నుంచి మేయర్ హరి వెంకట కుమారి ఇతర నేతలు మాత్రం పనిచేస్తున్నారు. గడువు దగ్గర పడుతున్న కొద్దీ కూటమిలో హుషార్ కనిపిస్తూంటే వైసీపీలో నిరుత్సాహం కనిపిస్తోంది. స్థాయీ సంఘం ఎన్నికల్లో మెజారిటీ ఉండి కూడా వైసీపీ ఓటమి పాలు అయితే మాత్రం విశాఖ నుంచి వైసీపీకి మరో భారీ షాక్ ఎదురైనట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.