Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ జాతీయ స్థాయిలో వైసీపీకి అరుదైన ఘనతలు!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 April 2024 9:30 AM GMT
ఎన్నికల వేళ జాతీయ స్థాయిలో  వైసీపీకి అరుదైన ఘనతలు!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం తీవ్రస్థాయిలో వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను గద్దె దింపాలని కూటమి బలంగా కంకణం కట్టుకున్న వేళ... వైనాట్ 175 అంటూ జగన్ ముందుకు కదులుతున్నారు. ఈ సమయంలో జాతీయ స్థాయిలో వైసీపీ రెండు అరుదైన ఘనతలు సాధించింది. దీంతో... ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆ పార్టీ పేరు వైరల్ గా మారింది!

అవును... ఢిల్లీ కేంద్రంగా జాతీయ స్థాయిలో ఏపీ అధికార పార్టీ వైసీపీ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఇందులో భాగంగా ఏపీకి రాజ్యసభలో ఉన్న 11 ఎంపీ స్థానాలనూ తన ఖాతాలో వేసుకుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీడీపీకి ఉన్న ఒక్క సభ్యుడు కనకమేడల రవీంద్రబాబు పదవీ కాలం ముగిసింది. దీంతో... పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం శూన్యమైంది!

మరోపక్క వైసీపీ నుంచి కొత్తగా ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. ఇందులో భాగంగా... గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి లతో రాజ్యసభ ఛైర్మన్ థన్కడ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఇంగ్లిష్ లో దైవ సాక్షిగా వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు!

హిందీలో దైవసాక్షిగా గొల్ల బాబురావు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... రాజ్యసభలో దళితులకు జగన్ అవకాశం కల్పించారని.. ఎన్నో ఒత్తిడులు ఉన్నా తన లాంటి పేద వార్గాల వారికి రాజ్య సభ సీటు ఇచ్చారని.. తన పదవీకాలంలో పేదల సమస్యలను రాజ్యసభలో ప్రస్థావిస్తానని తెలిపారు.

మరోపక్క... వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. అయితే... ఆయన ఇప్పటికే తన సభ్యత్వానికి రాజీనామా చేసి, కూటమి అభ్యర్థిగా నెల్లూరు ఎంపీగా టీడీపీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఇలా ఏపీలో ఉన్న అన్ని రాజ్యసభ స్థానాలనూ దక్కించుకున్న పార్టీగా ఘనత సాధించిన వైసీపీ... మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది.

ఇందులో భాగంగా... రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో బీజేపీ - 97, కాంగ్రెస్ - 29, టీఎంసీ - 13 స్థానాలతో టాప్ త్రీ స్థానాల్లో ఉండగా.. 11 స్థానాలతో వైసీపీ నాలుగో స్థానంలో నిలిచింది. కాగా... సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ జగన్ తమ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.!