Begin typing your search above and press return to search.

వెనకబడిన వైసీపీ... టీడీపీ ఏం చేస్తుంది ?

ఏపీలో ఎన్నికల వేడి ఒక రేంజిలో సాగుతోంది. అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని వైసీపీ చూస్తోంది

By:  Tupaki Desk   |   22 April 2024 1:54 PM GMT
వెనకబడిన వైసీపీ... టీడీపీ ఏం చేస్తుంది ?
X

ఏపీలో ఎన్నికల వేడి ఒక రేంజిలో సాగుతోంది. అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని వైసీపీ చూస్తోంది. అదే టీడీపీ అయితే ఈసారి తప్పకుండా అధికారం లోకి రావాలని పట్టుదలగా ఉంది. రెండు వైపుల నుంచి ఇంతలా కసిగా పనిచేస్తున్న ఎన్నికలు బహుశా ఇవేనేమో అనుకోవాలి. 2014 నాటికి జగన్ చంద్రబాబు అన్నట్లుగా రాజకీయాల్లో బచ్చా కావచ్చేమో. కానీ 2019 నాటికే ఆరితేరిపోయారు.

ఇక ఇపుడు 2024 నాటికి అయిదేళ్ల సీఎంగా పనిచేసి బాబుని ఢీ కొడుతున్నారు. ఇద్దరూ సీఎంగా చేసిన వారే కావడంతో అనుభవం అన్న మాట ఈసారి ఎక్కడా ప్రస్తావనకు వచ్చే చాన్స్ లేదు. అదే సమయంలో 2014 నుంచి 2019 దాకా సాగిన టీడీపీ ప్రభుత్వం చేసిన పాలన అలాగే 2019 నుంచి 2024 దాకా సాగిన జగన్ పాలనను పోలిక పెట్టి జనాలు తీర్పు ఇవ్వవచ్చు అని వినిపిస్తోంది.

ఇక జగన్ వైపు నుంచి చూస్తే సంక్షేమం చూసి ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఏపీలో ఎనభై శాతం మంది ప్రజలు సంక్షేమ పధకాలు పొందారు కాబట్టి కచ్చితంగా వైసీపీ వైపే ఉంటారు అన్నది ఆ పార్టీ ధీమా. ఇక టీడీపీ సంక్షేమం ఏమీ చేయలేదని బాబు మార్క్ పధకం ఒక్కటి అయినా చూపించాలని సిద్ధం సభలలో జగన్ నిలదీస్తున్నారు.

దాంతో బాబుని కార్నర్ చేస్తున్నారు. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ ఊరుకుంటుందా జగన్ చేసే సంక్షేమం కంటే రెట్టింపు తాము చేస్తామని చెబుతోంది. ఆ విధంగా వైసీపీ సంక్షేమ నినాదాన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తోంది. అదే సమయంలో ఏపీలో అభివృద్ధి ఎక్కడ అని టీడీపీ గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తోంది.

దీంతో ఇరుకున పడడం వైసీపీ వంతు అవుతోంది. ఎందుకంటే గడచిన అయిదేళ్ల కాలంలో సంక్షేమం పైన పెట్టిన శ్రద్ధ అభివృద్ధి మీద వైసీపీ పెట్టలేదని అంటున్నారు. దాంతో ఇపుడు వైసీపీ అధినాయకత్వం దీనిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో అయినా సంక్షేమం అభివృద్ధి అన్నవి రెండు కళ్ళుగా పాలన చేస్తారు. ఏపీలో అయితే సంక్షేమం పాళ్ళు ఎక్కువ అయ్యాయి.

దాంతో రోడ్లకు కూడా బాగు చేసేందుకు నిధులు లేవని దాంతో రోడ్ల దుస్థితి చూస్తే చాలు వైసీపీ ప్రభుత్వ నిర్వాకం తెలిసిపోతుందని విపక్షాలు చేస్తున్న విమర్శలు జనం చెవిలోకి బాగానే ఎక్కుతున్నాయి. సంక్షేమం రూట్ నుంచి మెల్లగా అభివృద్ధి వైపు డిబేట్ సాగేలా టీడీపీ కూటమి కనుక గేర్ మార్చితే కనుక కచ్చితంగా అది వైసీపీకి ఇబ్బంది అవుతుంది.

ఇప్పటిదాకా సిద్ధం సభలలో జగన్ ప్రసంగాలు చూస్తే అన్నీ సంక్షేమం గురించే ఉన్నాయి. మరో అయిదేళ్లు అధికారం ఇస్తే పథకాలు కంటిన్యూ చేస్తాను అంటున్నారు. ఆయా వర్గాలకు అది ఆనందం కలిగించేదే అయినా ఏపీలో అభివృద్ధిని కోరుకునే వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిని కూడా తమ వైపు తిప్పుకునేలా వైసీపీ అభివృద్ధి అజెండా బయటకు తీయాల్సి ఉందని అంటున్నారు.

తాము అధికారంలోకి ఆ అయిదేళ్ళలో ఏపీని అభివృద్ధి చేస్తామని దానికి తగిన విజన్ తమ దగ్గర ఉందని వైసీపీ కచ్చితంగా చెప్పాల్సి ఉంది. ప్రజల మదిలో మెదిలే అనేక సందేహాలకు జవాబు ఇవ్వాల్సి ఉంది. ఏపీలో అభివృద్ధి ఉందని వైసీపీ అంటోంది. పోర్టులు పదిహేడు మెడికల్ కాలేజీలు అలాగే గ్రామాల్లో సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, అలాగే వైద్యాలయాలు ఇవన్నీ చూపిస్తోంది.

కానీ వీటితో పాటు భారీ ప్రాజెక్టులు చూపించాలి.సమప్ద్ను సృష్టించే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పాలి. అలాగే ఏపీకి రాజధాని తో పాటు పోలవరం పూర్తి చేస్తామని కూడా హామీ ఇవ్వాలి. అలాగే ఏపీలో మేటి అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఏమి చేస్తామో చెప్పాలి. ఏపీని పారిశ్రామికంగా ఏలా తీర్చిదిద్దుతామో కూడా వెల్లడించాలి . మొత్తం మీద చూస్తే ఈ విషయంలో వైసీపీ వెనకబడి ఉందని అంటున్నారు. రానున్న రోజులలో జగన్ చేసే ప్రచారంలో అయినా అభివృద్ధి అజెండాను ఎత్తుకోకపోతే మాత్రం హోరా హోరీ పోరాటంలో ఇబ్బందులు తప్పవని అంటున్నారు.