అభ్యర్థులు ఓకే అక్కడ వీరికి నిద్ర పట్టట్లేదట!
అయితే.. ఇంత జరుగుతున్నా.. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పోటీలో ఉన్న నాయకులు లైట్ తీసుకున్నారు.
By: Tupaki Desk | 27 May 2024 8:30 AM GMTరాష్ట్రంలో ఈ నెల 13 నజరిగిన ఎన్నికల పోలింగ్ తర్వాత.. అటు టీడీపీలోను, ఇటు వైసీపీలోనూ.. కూడా నాయకులకు టెన్షన్ పట్టుకుంది ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అనే విషయంపై చాలా వరకు క్లారిటీ లేకపోవడం.. ఎవరి పక్షం వారు వారికి అనుకూలంగా తీర్పులు చెబుతుండడంతో ఎవరు గెలుస్తా రనేది సందేహంగానే మారింది. దీంతో కీలక నాయకులకు కంటిపై కునుకు లేకుండా పోయింది. అయితే.. ఇంత జరుగుతున్నా.. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పోటీలో ఉన్న నాయకులు లైట్ తీసుకున్నారు.
పోటీ ఉందని తెలిసినా పెద్దగా టెన్షన్ ఫీల్ కావడం లేదు. దీనికి కారణం.. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించే బాధ్యతను వేరే వారు తీసుకోవడమే. దీంతో అసలు నాయకులు.. పెద్దగా చింతించడం లేదు. ఆ టెన్షన్.. ఆ బాధ అంతా.. ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీని గెలిపిస్తామని బాధ్యతలు తీసుకున్నవారే.. పడుతున్నారు. ఉదాహరణకు కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్ పోటీ లో ఉన్నారు. కానీ, ఈయన కు పెద్దగా టెన్షన్ లేదు. ఉన్న టెన్షన్ అంతా కూడా.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి పడుతున్నారు.
ఎందుకంటే.. పెద్దిరెడ్డి ఆది నుంచి చంద్రబాబును ఓడించేందుకు నడుం బిగించారు. దీంతో అంతా ఆయన కనుసన్నల్లోనే ప్రచారం జరిగింది. దీంతో భరత్ నిమిత్తమాత్రంగా ఉన్నారు. ఇక, కీలకమైన పిఠాపురంలో వైసీపీ నాయకురాలు వంగా గీత పోటీ చేశారు. ప్రచారంలో ఆమె దూకుడుగా నే ఉన్నారు. టెన్షన్ కూడా పడ్డారు. కానీ.. పోలింగ్ తర్వాత. ఫ్రీగా ఉన్నారు. దీనికికారణం.. ఇక్కడ ఆమె గెలుపు బాధ్యతలను ఎంపీ మిథున్‌రెడ్డి, కాపు నేత ముద్రగడ పద్మనాభం తీసుకున్నారు.
అలానే.. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీని గెలిపించే బాధ్యతలను స్తానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీసుకున్నారు. జగన్ ఆయనకే ఈ బాధ్యత అప్పగించారు కూడా. అయితే.. మురుగుడు లావణ్యను ఇక్కడ పోటీకి పెట్టారు. మొదట్లో ఆమె టెన్షన్ పడినా.. తర్వాత తర్వాత.. తన కుటుంబం సహా ఆళ్లకే తన గెలుపు బాధ్యతలను అప్పగించారు. దీంతో ఇక్కడ లావణ్య కూడా లైట్ తీసుకుంటున్నారు.
ఇక, విజయవాడ వెస్ట్‌లో వైసీపీని గెలిపించే బాధ్యతను ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తీసుకున్నారు. ఫండింగ్ కూడా ఆయన వహించారు. ఇక్కడ నుంచి ఆసిఫ్ బరిలో ఉన్నారు. ఆయనకు అప్పుడు.. ఇప్పుడు.. కూడా టెన్షన్ లేదు. ఇలానే మైలవరం, శింగనమల వంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అసలు అభ్యర్థులకు లేని టెన్షన్ వీరిని గెలిపిస్తామన్న అభ్యర్థులకు చుట్టుకోవడం గమనార్హం.