విశాఖ మీద వైసీపీకి మోజు తీరిపోయిందా ?
విశాఖ మీద మోజు లేకపోవడం ఏంటి అన్నదే ఇక్కడ ప్రశ్న. మామూలుగా చూస్తే విశాఖ వైసీపీని కలిపి గత అయిదేళ్లుగా అంతా చదువుకున్నారు
By: Tupaki Desk | 17 Aug 2024 3:15 AM GMTవిశాఖ మీద మోజు లేకపోవడం ఏంటి అన్నదే ఇక్కడ ప్రశ్న. మామూలుగా చూస్తే విశాఖ వైసీపీని కలిపి గత అయిదేళ్లుగా అంతా చదువుకున్నారు. ఆ విధంగా వైసీపీ నేతలు ప్రకటనలు వారి యాక్షన్ ఉంటూ వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలలోనే తన మనసులో మాటను బయటపెట్టింది.
అమరావతి కేవలం శాసన రాజధాని అని విశాఖ పరిపాలనా రాజధాని అని కర్నూలు న్యాయ రాజధాని అని చెబుతూ వచ్చింది. పాలన ఎక్కడ ఉంటే దానినే అసలైన రాజధానిగా చెబుతూ వస్తారు. దాంతో అమరావతికి ప్రాధాన్యత అమాంతం తగ్గించే ఆలోచనతోనే వైసీపీ పెద్దలు ఉన్నారని అర్థం చేసుకున్న మీదట అమరావతి ఉద్యమం భగ్గుమంది.
ఆ సమయంలో అయినా అమరావతి రైతులతో చర్చలు జరిపినా ఒక అర్థం ఉండేది. ఇక మూడు రాజధానుల మీద చట్టం చేశారు. అయితే అమరావతి రైతులు హైకోర్టుకు వెళ్ళడంతో హడావుడిగా ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నారు. హైకోర్టు అయితే అమరావతి ఏకైక రాజధాని అని తీర్పు ఇచ్చేసింది. దాని మీద ఆరు నెలలు ఆగి సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేశారు.
ఇలా మూడు రాజధానుల విషయంలో ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో వేశారు. ఇక్కడ వైసీపీ పెద్దలు తెలుసుకోలేనిది కళ్ల ముందు కనిపించే సత్యాన్ని అని అంటున్నారు. విశాఖ వాసులు అయితే రాజధానిని కోరలేదు. అమరావతి రైతులు రాజధాని అంటేనే భూములు ఇచ్చారు. మరి కావాలని అన్న వారి నుంచి రాజధానిని తగ్గించి వద్దు అన్న వారి వద్దకు తీసుకుపోవడంతో రాజకీయ వ్యూహం ఏమిటో వైసీపీ పెద్దలకే తెలియాలని కూడా అనుకున్నారు.
ఇక ఎన్నికలు జరిగాయి. వైసీపీ ఎంతో మోజు పడి రాజధాని చేయాలనుకున్న విశాఖలోనే ఆ పార్టీని ఘోరంగా ఓడించేశారు. ఎటూ అమరావతిలో వ్యతిరేకత కారణంగా పార్టీ ఓడింది. రెండింటికీ చెడ్డ అయింది. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వస్తూనే అమరావతి రాజధాని మీదనే పూర్తి ఫోకస్ పెడుతోంది. అమరావతిని రానున్న అయిదేళ్ల కాలంలో ఒక రూపూ షేపునకు తీసుకుని రావాలని చూస్తోంది.
అంతే కాదు అమరావతి రాజధానిని మళ్లీ వైసీపీ వచ్చినా తరలించేందుకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా చట్టపరంగా రక్షణ కూడా చేయాలని ఆలోచిస్తోంది. ఇక టీడీపీ కూటమికి ఈ విషయంలోనే వైసీపీ దొరికిపోతోంది. వైసీపీ మళ్లీ వస్తే ఈ అభివృద్ధి ఉండదు అని పదే పదే కూటమి పెద్దలు చేస్తున్న హెచ్చరికలు జనాల్లో చర్చకు వెళ్తున్నాయి. దాంతో వైసీపీ బదనాం అవుతోంది.
కాస్తా ఆలస్యంగా అయినా ఈ విషయం అర్ధం చేసుకున్న వైసీపీ అయితే మూడు రాజధానుల వ్యవహారానికి ఇక స్వస్తి అన్నట్లుగానే ఉంది. అయితే బాహాటంగా మాత్రం ఇప్పటికి అయితే ప్రకటించలేదు. ఎటూ విశాఖ జనాలకు రాజధాని మీద ఆసక్తి లేనపుడు అక్కడ వారి కోసం తాము ఎందుకు అమరావతికి చెడ్డ కావాలన్న తెలివిడి కూడా వచ్చింది అని అంటున్నారు.
అందుకే లోక్ సభలో వైసీపీ ఎంపీలు అమరావతి రాజధాని నిర్మాణానికి రుణాలు వద్దు కేంద్రం ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది వైసీపీ మారిన స్టాండ్ కి నిదర్శనం అని అంటున్నారు. అంతే కాదు అమరావతి విషయంలో ఇక మీదట తాము సైలెంట్ గానే ఉండాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికిపుడే ఏమీ అనకుండా ఉంటూనే సరైన సమయంలో వ్యూహాత్మకంగా ప్రకటన చేయడంతో పాటు మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి అన్న కొత్త నినాదాన్ని అందుకోవాలని కూడా వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. దానికి రాజధానితో ముడి పెట్టకుండా ఉండేలా చూసుకోవాలని అనుకుంటున్నారు. ఏది ఏమైనా వైసీపీకి ఇపుడు పూర్తిగా వాస్తవాలు బోధపడ్డాయని అంటున్నారు. సో అమరావతికి మా మద్దతు అని వైసీపీ ప్రకటించే రోజు తొందరలో వస్తుందా అంటే దానికి కారణమే జవాబు చెప్పాల్సి ఉంటుంది.