Begin typing your search above and press return to search.

పోలవరంలో వైఎస్సార్ చేసిన పనులు కూడా టీడీపీ ఖాతాలోకి?

అయితే ఇందులో టీడీపీ తన హయాంలో పనులనే కాకుండా వైఎస్సార్ హయాంలో జరిగిన పనులను కూడా కలిపేసుకుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Jun 2024 2:45 AM GMT
పోలవరంలో వైఎస్సార్ చేసిన పనులు కూడా టీడీపీ ఖాతాలోకి?
X

పోలవరం భారీ బహుళార్ధక శాధక ప్రాజెక్ట్ కధ ఈనాటిది కాదు. ఇక వైఎస్సార్ సీఎం అయ్యాక కదలిక అయితే వచ్చింది. అప్పట్లో కొంత పని జరిగింది. కాలువలు తవ్వారు, అనుమతులు అయితే ఎక్కువగా సంపాదించడం మీద దృష్టి పెట్టారు. వైఎస్సార్ 2004 నుంచి 2009 మధ్య కాలంలో పోలవరం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచారు. ఆ తరువాత ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా కొంత వరకూ నిధులు అందించారు, పనులు కూడా కొంత మేరకు జరిగాయి.

ఇదంతా ఫ్లాష్ బ్యాక్. విభజన ఏపీలో చూసుకుంటే 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరో వైపు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయింది. కేంద్రం నిధులతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కావాల్సి ఉంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వంగా టీడీపీ ఈ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టింది. అయిదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి తాము 72 శాతానికి పైగా పనులు పూర్తి చేశామని ఆనాడూ ఈనాడూ టీడీపీ చెబుతూ వస్తోంది.

ఏపీలో మరోసారి చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం సందర్శించారు. ఆ తరువాత పోలవరం పురోగతి మీద టీడీపీ సోషల్ మీడియా వివరాలు పెడుతూ తమ హయాంలో ఎంత జరిగింది, అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో ఎంత జరిగింది అన్న దానిని గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేశారు.

అయితే ఇందులో టీడీపీ తన హయాంలో పనులనే కాకుండా వైఎస్సార్ హయాంలో జరిగిన పనులను కూడా కలిపేసుకుందని అంటున్నారు. అవన్నీ కూడా టీడీపీ ఖాతాలో వేసుకుందని అంటున్నారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ మీద పెట్టిన ఖర్చులు కానీ జరిగిన పనులు కానీ 2014 కంటే ముందే ఉన్నాయి.

అవి 2004 నుంచి స్టార్ట్ అయ్యాయి. అలా అంతకు ముందు పదేళ్లలఒ వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన ఖర్చులను తీసేసి చూపిస్తే నికరంగా టీడీపీ తన హయాంలో ఎంత ఖర్చు చేసిందో ఒక లెక్క తెలుస్తుంది కదా అని మేధావులు అంటున్నారు. ఇక టీడీపీ సోషల్ మీడియా వింగ్ విడుదల చేసిన దాని ప్రకారం పట్టిక చూస్తే పోలవరం ప్రాజెక్ట్ పనులు 2019 మే నాటికి 72 శాతం పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు

అదే విధంగా చూస్తే అవి కాస్తా 2024 మే నాటికి అంటే అయిదేళ్ల జగన్ పాలనలో 75.73 శాతంగానే అయ్యాయని చెప్పారు. అంటే కేవలం 3.73 శాతం పనులు మాత్రమే వైసీపీ హయాంలో అయినట్లుగా పేర్కొన్నారు. సివిల్ వర్క్స్ టీడీపీలో హయాంలో 71.93 శాతం అయితే వైసీపీ హయాంలో 75.77 శాతం అయ్యాయని తెలిపారు. అంటే 3.84 శాతం పెరుగుదల మాత్రమే అన్న మాట.

ఇక హెడ్ వర్క్స్ టీడీపీ హయాంలో 65.67 శాతం అయితే వైసీపీ హయాంలో 72.63 శాతానికి చేరుకున్నాయి. అంటే 6.96 శాతం మాత్రమే జరిగాయని లెక్క తేల్చారు. రైట్ మెయిన్ కెనాల్ పనులు టీడీపీ హయాంలో 91.14 శాతం పూర్తి అయితే వైసీపీ హయాంలో 92.75 మాత్రమే జరిగాయని ఇది 1.61 శాతం మాత్రమే జరిగిందని వివరించారు.

లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు టీడీపీ హయాంలో 70.99 శాతం జరిగితే వైసీపీ హయాంలో 73.07 శాతంగా జరిగాయని, ఈ పెరుగుదల కేవలం 2.08 గానే ఉందని పేర్కొన్నారు. ల్యాండ్ అక్విజిజన్ పునరావాసం పనులు చూస్తే టీడీపీ హయాంలో 18.66 శాతంగా పనులు జరిగితే వైసీపీ హయాంలో 22.55 శాతం మేర జరిగాయని వివరించారు. అంటే కేవలం 3.89 శాతం మాత్రమే జరిగిందని తేల్చారు.

మొత్తం ఖర్చు టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్ట్ కోసం 16,493.38 కోట్లు పెడితే వైసీపీ హయాంలో 21,489.71 కోట్లుగా పేర్కొన్నారు. అంటే అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో 4996. 53 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అని క్లారిటీగా చెప్పారు. మరి దీని మీద వైసీపీ వివరణ ఎలా ఉంటుందో తెలియదు కానీ పోలవరం విషయంలో వైసీపీ అయిదేళ్ళలో ఏమీ చేయలేదనే టీడీపీ పట్టిక తేల్చేసింది.