నాగార్జున వర్సిటీలో వైఎస్ విగ్రహం తొలగింపు
ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి అనంతరం వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
By: Tupaki Desk | 11 Jun 2024 4:20 AM GMTఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి అనంతరం వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితాలు వెల్లడై.. టీడీపీ కూటమి అఖండ విజయాన్ని సాధించిన సందర్భంలోనే వైఎస్ ఆరోగ్య వర్సిటీ పేరు బోర్డును తొలగించటం తెలిసిందే. ఎన్టీఆర్ వైద్య విద్య వర్సిటీ పేరును జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అప్పటికే ఒక దివంగత ముఖ్యమంత్రి పేరుతో ఉన్న వర్సిటీ పేరును మార్చటం సరికాదన్న సూచనలు వినిపించాయి. కావాలంటే పేర్లు పెట్టుకోవటానికి చాలానే పేర్లు ఉన్నాయని.. అలాంటప్పుడు పని కట్టుకొని మరీ ఎన్టీఆర్ వైద్య విద్యా వర్సిటీ పేరును మార్చాల్సిన అవసంర లేదని చెప్పినా వినకుండా.. పట్టుబట్టి మరీ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు.. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే.. నాడు భారీ విగ్రహానని ఏర్పాటు చేసిన పెద్దల సమక్షంలోనే తాజాగా ఆ విగ్రహాన్ని తొలగించటం గమనార్హం. సమాజానికి విద్యావంతుల్నిఅందించే విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నేతల విగ్రహాలు పెట్టటం సరికాదని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
అయినప్పటికీ అప్పటి వీసీ ఆచార్య రాజశేఖర్ ఆ వాదనను పట్టించుకోలేదు. వర్సిటీ నిధులతో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. నాటి ప్రభుత్వసలహాదారు.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డిని ఆహ్వానించి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీన్ని తొలగించాలని కొన్నాళ్లుగా డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నా.. దాన్ని పట్టించుకోలేదు. అంతేకాదు విశ్వవిద్యాలయాన్ని రాజకీయ పార్టీలకు వేదికగా మార్చటం.. నాటి అధికార వైసీపీ ప్లీనరీ సందర్భంగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించటం లాంటి వివాదాస్పద నిర్ణయాల్ని తీసుకున్నారు.
తాజాగా వైఎస్ విగ్రహాన్ని తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చివరకు వారి ఆందోళన వేడికి తగ్గిన ఆయన.. రెండు రోజుల్లో విగ్రహాన్ని తొలగిస్తానని చెప్పగా.. అందుకు విద్యార్థులు ససేమిరా అన్నారు. సాయంత్రం లోపు తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మెట్టు దిగిన రాజశేఖర్.. అప్పటికప్పుడు ప్రొక్లెయిన్ తెప్పించి విగ్రహాన్ని తొలగించారు. ఈ అంశం వర్సిటీలో హాట్ టాపిక్ గా మారింది.