ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్ విగ్రహానికి నిప్పు
టీడీపీ ఆరాచకాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లుగా మండిపడుతున్నారు.
By: Tupaki Desk | 29 Jun 2024 9:45 AM GMTఅధికార బదిలీ వేళ.. రాష్ట్రం ఏదైనా కొన్ని దుశ్చర్యలు.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం మామూలే. ఇటీవల ఎన్నికల ఫలితాలు వెల్లడై.. ఏపీలో అధికార బదిలీ జరిగిన నేపథ్యంలో అధికార టీడీపీ వర్సెస్ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మధ్య కొన్ని ఘటనలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనలు చాలా చిన్నవని.. ఐదేళ్ల జగన్ పాలన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో పోలిస్తే.. వీటిని లెక్కల్లోకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
అయితే.. వైసీపీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా రియాక్టు అవుతున్నారు. టీడీపీ ఆరాచకాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లుగా మండిపడుతున్నారు. తప్పుడు పనులను తాను ఉపేక్షించనని.. కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు స్పష్టం చేస్తున్నప్పటికీ కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని టీడీపీనేతలు బరితెగించారని.. వైఎస్సార్ విగ్రహాన్ని కాల్చేశారని చెబుతున్నారు. అయితే.. ఫలానా వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఎవరూ చెప్పట్లేదు.
ఇదిలా ఉంటే ఇదే జిల్లాలోని భట్టిప్రోలు మండలం అద్దెపల్లి దళిత వాడలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వాట్సాప్.. సోషల్ మీడియా గ్రూపుల్లో దీనికి సంబంధించినవ వీడియో వైరల్ గా మారింది. ఈ దారుణానికి తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. తెలుగు తమ్ముళ్ల వాదన మరోలా ఉంది. ఇలాంటి పనులు తాము చేయలేదని.. వైసీపీ నేతల మధ్య పోరు ఉందని.. అందులో భాగంగా వారే ఇలా చేసి ఉండొచ్చన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి వెలుగు చూసినంతనే సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు. దీనికి కారణం.. ఇలాంటి ఉదంతాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువ డ్యామేజ్ చేసే వీలుందన్నది మర్చిపోకూడదు.