Begin typing your search above and press return to search.

ఫోకస్ ఏపీ కాదు.. తెలంగాణ మీదే.. షర్మిల స్టాండ్ ఇది!

అన్న జగన్ కు అన్ని ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రచారం చేసిన షర్మిల తెలంగాణకు ఎందుకొచ్చారన్నది అందరినీ వెంటాడిన ప్రశ్న

By:  Tupaki Desk   |   31 Aug 2023 7:12 AM GMT
ఫోకస్ ఏపీ కాదు.. తెలంగాణ మీదే.. షర్మిల స్టాండ్ ఇది!
X

అన్న ఏపీలో అధికారంలో ఉండగా.. తెలంగాణలో తండ్రి పేరిట పార్టీ నెలకొల్పి.. రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలకు దిగి చర్చనీయాంశంగా మారారు వైఎస్ షర్మిల. పార్టీ పెట్టి రెండేళ్లయినా అసలు ఆమె ఉద్దేశం ఏమిటి..? అధికారమా? ఆస్తుల పంచాయితీయా? అన్నది తేలనే లేదు. ఇంతలోనే తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సమాయత్తం అయ్యారు. ఇదే పనిమీద ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు.

అసలెందుకు వచ్చారు?

అన్న జగన్ కు అన్ని ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రచారం చేసిన షర్మిల తెలంగాణకు ఎందుకొచ్చారన్నది అందరినీ వెంటాడిన ప్రశ్న. రాజన్న రాజ్యం నెలకొల్పేందుకు తాను తెలంగాణకు వచ్చానని, ఈ రాష్ట్ర కోడలినని చెబుతుంటారు. భారీ స్ఠాయిలో పాదయాత్ర కూడా చేశారు. కానీ, ఆమెకు దక్కిన ప్రజాదరణ అంతంతే. రెండేళ్లయినా ఆ పార్టీలో పెద్ద నాయకులు ఎవరూ చేరలేదు. దీంతోనే తెలంగాణ వాదం ముంగిట అసలు షర్మిల పార్టీ తెలంగాణలో మనగలుగుతుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

కాంగ్రెస్ లో విలీనమా..? అనూహ్యం

అన్న జగన్ అత్యంత ద్వేషించి బయటకు వచ్చిన పార్టీ కాంగ్రెస్ . అంతేకాదు ఆయనను జైల్లో పెట్టి వేధించిన పార్టీ కాంగరెస్. అలాంటి పార్టీలోనే షర్మిల తన పార్టీ వైఎస్సార్టీపీని విలీనం చేయనుండడం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. అయితే, షర్మిల సేవలను ఏపీకి వాడుకునే ఉద్దేశంలోనే కాంగ్రెస్ ఇలాంటి వ్యూహాత్మక ఎత్తుగడ వేసిందనే వాదన ఉంది. కానీ, ఇప్పుడా అధిష్ఠానానికే షాక్ ఇచ్చేలా షర్మిల వ్యాఖ్యలు చేశారు. సోనియా రాహుల్ తో భేటీ అనంతరం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు.

పొద్దుపొద్దున్నే కేసీఆర్ పై ధ్వజం

గురువారం ఉదయాన్నే సోనియా, రాహుల్ తో భేటీ అయిన షర్మిల.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఆయనకు కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. అంతేగాక తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే తాను సోనియా, రాహుల్ తో మాట్లాడినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఏది మేలో అదే చేస్తానని పేర్కొన్నారు. షర్మిల వ్యాఖ్యలతో ఆమె ఫోకస్ అంతా తెలంగాణ మీదనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏపీలో అన్న జగన్ కు పోటీగా ఆమెకు కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగిస్తుందని అంచనా వేసినా ఆ దిశగా షర్మిల ఆలోచనలు ఉన్నట్లు కనిపించడం లేదు. ఒకవేళ ఏపీ బాధ్యతలూ చూడాల్సి వచ్చినా ముందుగా ఆమె తెలంగాణపైనే ఫోకస్ పెడతారని తెలుస్తోంది.