షర్మిలక్క డెసిషన్ నచ్చట్లే...!
ఆమె తెలంగాణాలో వైఎస్సార్ కి అభిమానులు విస్తృతంగా ఉన్నారు. అని భావించి రెండున్నరేళ్ల క్రితం పార్టీని స్థాపించారు
By: Tupaki Desk | 1 Sep 2023 10:24 AM GMTరాజకీయాల్లో ఆవేశాలు పనికిరావు. ఆలోచనలు ఉండాలి. అలాగే పదునైన వ్యూహాలు కూడా అవసరం అవుతాయి. రాజకీయం అంటేనే సహనం సంయనమంతో చేయాల్సి ఉంటుంది. కానీ వైఎస్సార్ టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల రాజకీయం ఏ వైపున సాగుతుందో ఆమెను నమ్ముకుని పార్టీలో చేరిన వారికి అసలు అర్ధం కావడంలేదు.
ఆమె తెలంగాణాలో వైఎస్సార్ కి అభిమానులు విస్తృతంగా ఉన్నారు. అని భావించి రెండున్నరేళ్ల క్రితం పార్టీని స్థాపించారు. అదే టైం లో ఆమె ఏకంగా ఏ మహిళా నడవలేని విధంగా మూడు వేల ఏడువందల యాభై కిలోమీటర్ల మేర భారీ పాదయాత్ర చేశారు. ఆమె పట్టుదలకు అది నిదర్శనం అని అంతా తలచారు.
ఒక దశలో కేసీయార్ మీద ఆమె చేసిన తీవ్ర విమర్శలకు ఆమెను ఒక ఆల్టర్నేటివ్ లీడర్ గా నిలబెడతాయని అంతా తలచారు. అయితే వైఎస్సార్ తనయగా జనంలో గుర్తింపు ఉన్నా ఆమె ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆలా చేయకపోవడం వల్లనే ఆమె పార్టీలో పెద్ద లీడర్స్ ఎవరూ చేరలేదు అని అంటారు.
ఇక ఆమె కేసీయార్ ని ఓడిస్తామని, తమదే అధికారం అని చెప్పుకుని వచ్చారు. అలాంటి షర్మిల పార్టీ మీద మూడు నెలల క్రితం విలీనం ప్రచారం వచ్చినపుడు ఆమె గట్టిగా ఖండించారు. ఇపుడు ఆమె స్వయంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీల వద్దకు వెళ్ళి కలసి వచ్చారు.
రేపో మాపో పార్టీని విలీనం చేస్తారు అని అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో షర్మిలకు ఏమి లాభం అన్నది ఒక చర్చ అయితే ఆమె రెండున్నరేళ్ల పాటు పార్టీని నడిపారు. చాలా మంది అందులో చేరారు. దాంతో అలా చేరిన ద్వితీయ తృరీయ శ్రేణి నాయకులు మాత్రం ఆమె ఏకపక్ష నిర్ణయాల మీద తీవ్రంగా మండిపడుతున్నారు.
వైసీపీలో అంతకు ముందు కాంగ్రెస్ లో ఉన్న కొండా రాఘవరెడ్డి అయితే వైఎస్సార్ చనిపోయిన తరువాత ఆయన పేరుని ఎఫ్ ఐ ఆర్ లో పెట్టిన కాంగ్రెస్ ని వైఎస్సార్ ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగిన పార్టీని, జగన్ని జైలుకు పంపిన పార్టీని షర్మిల గౌరవించి అందులో చేరడం దారుణం అన్నారు. తాము వైఎస్సార్ ని దేవుడిగా చూస్తామని అందుకే ఆ పార్టీలో రాజన్న బిడ్డ అని చేరామని అన్నారు.
అయితే షర్మిల పోకడలు ఒంటెత్తుగా ఉన్నాయని, తన తండ్రిని అవమానం చేసిన పార్టీలోకి ఆమె వెళ్లాలనుకోవడం బాధాకరం అని ఆయన అన్నారు. ఇక మరో నేత గట్టు రామచంద్రరావు ఇదే రకంగా రియాక్ట్ అయ్యారు. వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తగదని అన్నారు. వైఎస్సార్ ఫ్యామిలీకి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసింది అని తెలిసి ఇలా చేయడం అంటే బాధాకరం అన్నారు.
నల్గొండ జిల్లా తుంగతుర్తికి చెందిన సోమన్న అనే నేత అయితే రెండేళ్ళ క్రితం పార్టీలో చేరామని తనను తుంగతుర్తి అభ్యర్ధిగా ప్రజల సమక్షంలో షర్మిల ప్రకటించారని, ఇపుడు ఆమె విలీనం చేసినా మరే పొత్తులు పెట్టుకున్నా తన సీటుకు తనకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తో పొత్తు అంటే తాము ఆ పార్టీలోకి వచ్చేవాళ్ళమే కాదు అని అంటున్నారు.
మొత్తం మీద చూసుకుంటే షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని వైఎస్సార్ వీరాభిమానులు అయితే తట్టుకోలేకపోతున్నారు అని చెప్పాలి. వైఎస్సార్ మరణానంతరం జరిగిన సంఘటనలను తలచుకుంటున్న వారు అంతా కాంగ్రెస్ వైఎస్సార్ ఫ్యామిలీకి ద్రోహం చేస్తే ఇపుడు రాజకీయం కోసం ఆ పార్టీలోకి వెళ్లడం ఏంటి అని నిలదీస్తున్నారు.
అయితే వైఎస్ షర్మిల మాత్రం కొండా రాఘవరెడ్డి తమ పార్టీలో చాలా కాలంగా యాక్టివ్ గా లేరని కొట్టి పారేశారు. ఆమె అడుగులు విలీనం దిశగా సాగుతున్నాయని అంటున్నారు. అయితే ఇంత చేసి ఒక పార్టీ పెట్టి వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాజన్న బిడ్డ ఎక్కడా తగ్గదు అని చెప్పి చివరికి కాంగ్రెస్ లో దాన్ని విలీనం చేయడం సబబేనా అన్న వారూ ఉన్నారు.
ఆ మాత్రం దానికి సొంతంగా పార్టీ పెట్టడం ఎందుకు అన్న ప్రశ్నలు వేస్తున్నారు. కాంగ్రెస్ లో విలీనం అయినా షర్మిల కోరుకున్న పదవులు కానీ ఆమె అనుకున్నది కానీ అగ్ర నాయకత్వం ఇస్తుందా. ఇవ్వాలనుకున్నా టీ కాంగ్రెస్ నేతలు పడనిస్తారా అనంది మరో డౌట్ గా ఉంది వ్రతం చెడినా ఫలితం దక్కకపోతే షర్మిల రాజకీయం కాంగ్రెస్ తోనే ఆగిపోతుంది అని అంటున్న వారూ ఉన్నారు.