Begin typing your search above and press return to search.

ఆ పార్టీలో షర్మిల చేరిక అప్పుడేనా?

దివంగత సీఎం వైఎస్సార్‌ కుమార్తె.. షర్మిల. తెలంగాణలో కాలికి బలపం కట్టుకుని పాదయాత్ర చేశారు

By:  Tupaki Desk   |   5 Sep 2023 6:15 AM GMT
ఆ పార్టీలో షర్మిల చేరిక అప్పుడేనా?
X

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణ వైఎస్సార్‌ పార్టీ ఏర్పాటు చేశారు.. దివంగత సీఎం వైఎస్సార్‌ కుమార్తె.. షర్మిల. తెలంగాణలో కాలికి బలపం కట్టుకుని పాదయాత్ర చేశారు. అయితే ఇన్ని పార్టీల మధ్య ఆ పార్టీని ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు రాష్ట్రమంతా పాదయాత్ర చేసినా ఒక్కరంటే ఒక్క పేరున్న నేత కూడా ఆ పార్టీలో చేరలేదు. దీంతో షర్మిల కూడా రూటు మార్చారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలసి వచ్చారు. తన పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేయడంపై చర్చించారని వార్తలు వచ్చాయి.

కాగా షర్మిల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లేదా క్రైస్తవులు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్నారని.. ఇవే ప్రతిపాదనలను సోనియా, రాహుల్‌ వద్ద పెట్టారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిల సెప్టెంబర్‌ 17న కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందని న్యూఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి.

ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణయ విధాయక విభాగమైన .. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు హైదరాబాద్‌ లో జరగనున్నాయి. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్‌ గాంధీ తెలంగాణలో భారీ సభను నిర్వహించనున్నారు. ఈ సభలోనే షర్మిల కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారని తాజాగా టాక్‌ నడుస్తోంది.

ఈ మేరకు గతవారం న్యూఢిల్లీలో సోనియా, రాహుల్‌ లను కలిసిన షర్మిల.. వారికి ఈ మేరకు సమాచారమిచ్చినట్టు చెబుతున్నారు.

అయితే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వ్యూహం మరోలా ఉందని అంటున్నారు. షర్మిలను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనేది వ్యూహమని చెబుతున్నారు. ఏపీలో షర్మిలతో పాదయాత్ర చేయించి తమకు దూరమైన ఎస్సీ, మైనారిటీ, ఎస్టీ వర్గాలను, కొంతమేరకు రెడ్డి సామాజికవర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవాలనేది కాంగ్రెస్‌ వ్యూహమని పేర్కొంటున్నారు.

అయితే షర్మిల ఏపీపైన ఆసక్తి చూపడం లేదని ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీకే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాకే చెందిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయనను కాంగ్రెస్‌ లోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారు. తుమ్మల కాంగ్రెస్‌ లోకి వస్తే పాలేరు సీటు ఇస్తామని చెబుతున్నారు.

ఈ క్రమంలో సెప్టెంబర్‌ 16, 17 తేదీల్లో రెండు రోజులు హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించాలని పార్టీ హైకమాండ్‌ నిర్ణయించింది. తర్వాత హైదరాబాద్‌ లో భారీ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో షర్మిల చేరికతోపాటు తుమ్మల నాగేశ్వరరావు చేరిక, అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో ప్రకటన వంటి అనేక అంశాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.