వైఎస్ షర్మిలను వద్దన్న సునీల్!?
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇంకా అనిశ్చితిలోనే కొనసాగుతోంది.
By: Tupaki Desk | 8 Oct 2023 12:30 PM GMTవైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇంకా అనిశ్చితిలోనే కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాలు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో పూర్తయ్యాయి. తుక్కుగూడలో ఆ పార్టీ భారీ బహిరంగ సభను సైతం నిర్వహించింది. ఈ క్రమంలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు అతీగతీ లేదు.
మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు పలువురు కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా చేరారు. వీరిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, యన్నం శ్రీనివాసరెడ్డి, నల్గొండ జిల్లా నేత జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
ఇటీవల మరణించిన విప్లవ వీరుడు గద్దర్ కుటుంబ సభ్యులతోనూ సోనియా గాంధీ సమావేశమయ్యారు. మరోవైపు పార్టీ విలీనం కోసమంటూ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను షర్మిల కలిసి వచ్చారు. ఈ క్రమంలో ఆమె ఇప్పటికే పార్టీలో చేరి ఉండాలి. అయితే చేరలేదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను షర్మిల కలిసి వచ్చారు. ఆయన ద్వారా కాంగ్రెస్ లో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
అయితే షర్మిల చేరికకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంగీకరించడం లేదని టాక్ నడుస్తోంది. ఆమె సేవలను తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తోంది. కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రేణుకా చౌదరి, వీహెచ్ హనుమంతరావు వంటివారు షర్మిల చేరికను వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.
మరోవైపు షర్మిల తనతోపాటు కొంత మందికి టికెట్లు ఇవ్వాలని కోరడం కూడా కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చడం లేదని టాక్. అలాగే తాను రాజన్న రాజ్యం తెస్తానని చెబుతుండటం పట్ల కూడా కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఉండాలంటే ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్పాల్సి ఉంది.. అలా కాకుండా షర్మిల.. రాజన్న రాజ్యం తెస్తానంటూ చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని అంటున్నారు.
అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో షర్మిల సైతం తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అంతేకాకుండా షర్మిల తాను చేస్తున్న ప్రసంగాల్లో ఎమ్మెల్యేలను, మంత్రులను దారుణంగా దూషిస్తుండటం పట్ల కూడా కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఇవన్నీ అటు తిరిగి, ఇటు తిరిగి బీఆర్‌ఎస్ కు అస్త్రాలుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. షర్మిల చేరడం బలం కంటే కూడా కాంగ్రెస్ కు నష్టం చేకూరే అంశాలే ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ అధిష్టానానానికి చెప్పినట్టు సమాచారం.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు.. షర్మిల చేరికను వ్యతిరేకించారని టాక్ ఒకటి నడుస్తుంది . కాంగ్రెస్ పార్టీ తాజాగా చేయించుకున్న సర్వేలోనూ షర్మిల చేరడం వల్ల కాంగ్రెస్ కు అదనపు ప్రయోజనం ఏమీ లేదని తేలిపోయిందని తెలుస్తోంది అని అంటున్నారు . ఈ విషయాన్ని కూడా సునీల్ కనుగోలు అధిష్టానానికి వివరించినట్టు చెబుతున్నారు.
షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఇంకో వర్గం తయారు అవుతుంది అని . ఆమె గతంలో తన కున్న పరిచయాలతో కాంగ్రెస్ లో తన కంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రమాదం కూడా ఉందని సునీల్ కనుగోలు సోనియాకు సూచించినట్టు సమాచారం. షర్మిలను పార్టీలో చేర్చుకోవద్దని సునీల్ కనుగోలు స్పష్టం చేసినట్టు ప్రచారం నడుస్తుంది .
మరోవైపు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ కాలికి బలపం కట్టుకుని 4 వేల కిలోమీటర్లకు పైగా షర్మిల పాదయాత్ర చేశారు. అయినా ఒక్కరంటే ఒక్క పేరున్న నేత కూడా చేరలేదు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమైందీ లేదు. గ్రామాలు, మండలాలు, జిల్లాలవారీగా పార్టీ కమిటీలు లేవు, వాటికి అధ్యక్షులు, కార్యవర్గం కూడా లేదు.
ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి తోడు బీఆర్‌ఎస్ తెలంగాణలో అత్యంత బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు తోడు బీజేపీ, ఎంఐఎం లాంటివి తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. ఇక కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీలాంటి పార్టీల్లోనూ చెప్పుకోదగ్గ నేతలున్నారు. కానీ షర్మిల పార్టీలో ఆమె తప్ప మరో పేరున్న నేత ఎవరంటే సమాధానం రావడం కష్టం.
ఈ నేపథ్యంలో అసలు షర్మిల పార్టీకి యంత్రాంగమే లేదని, ఆమె తప్ప మరో కాస్తో కూస్తో గుర్తింపు ఉన్న నేత కూడా ఆ పార్టీలో లేరని.. ఆమెకు అంత సీన్ ఇవ్వడం కూడా అనవసరమని సునీల్ కనుగోలు అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీకి తెలంగాణలో అంత సీన్ లేదని.. ఈ నేపథ్యంలో షర్మిలకు సీటు ఇవ్వడమే గొప్పని ఆయన తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంతవరకు షర్మిల చేరికకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు.
మరోవైపు తెలంగాణలో షర్మిల ఆశిస్తున్న పాలేరు అసెంబ్లీ సీటు కూడా ఆమెకు ఇచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. తాజాగా పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకు లేదా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల్లో ఒకరు పాలేరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసే వీలుంది.
ఈ నేపథ్యంలో షర్మిలను ఎవరూ పట్టించుకోవడం లేదు. సీడబ్ల్యూసీ సమావేశాలు ముగియడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు హామీలను అమలు చేస్తామని సోనియా గాంధీ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలను అంతా లైట్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
సునీల్ కనుగోలు సూచనల మేరకు తెలంగాణలో పార్టీలో చేరాలని ఆమె చేసిన అభ్యర్థనను కాంగ్రెస్ తిరస్కరించిందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇక షర్మిల ప్రస్థానం తెలంగాణ రాజకీయాల్లో శూన్యమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.