విలీనానికి వేళాయెరా... 4 న కాంగ్రెస్ లోకి వైఎస్సార్టీపీ (షర్మిల)!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి
By: Tupaki Desk | 2 Jan 2024 7:38 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధానంగా ఏపీలో ఈసారి జగన్ మోహన్ రెడ్డిని ఎలాగైనా గద్దెదింపాలని విపక్షాలు అన్నీ ఏకమవుతున్న వేళ... అసలు జగన్ ని దింపాల్సిన అవసరం కనిపించడం లేదనే కామెంట్లూ కామన్ మ్యాన్ నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు! ఈ నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణల్లో సాధించిన విజయం తాలూకు ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ పూర్వవైభవం సాధించాలని తాపత్రయపడుతుందని తెలుస్తుంది.
ఇందులో భాగంగా వైఎస్ షర్మిలను తమ పార్టీలో చేర్చుకుని, తగిన గౌరవం ఇచ్చి, అనంతరం ఏపీ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్స్ పార్టీ భావిస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో... వైఎస్ షర్మిళ తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఎప్పుడో నిర్ణయించేసుకున్నారని తెలుస్తుంది! ఈ సమయంలో అందుకు ముహూర్తాన్ని తాజాగా షర్మిళ ఫైనల్ చేశారని సమాచారం.
అవును... తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయంపై తన పార్టీ నేతలతో షర్మిళ కీలక ప్రకటన చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఈ నెల 4న వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు షర్మిళ తెలిపారని అంటున్నారు. ఈరోజు తాజాగా వైఎస్సార్టీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన షర్మిళ... ఈ మేరకు ఈ విషయాన్ని వెళ్లడించారని సమాచారం. దీనికోసం రేపు సాయంత్రం షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తుంది.
అన్నీ అనుకూలంగా జరిగితే విలీనం జరిగిన అనంతరమే షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని.. ఈ సందర్భంగా సోనియా, రాహుల్, ఖర్గేలతో భేటీ అనంతరం.. మీడియాను అడ్రస్ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
కాగా... తెలంగాణలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రెండ్రోజుల ముందు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరోక్షంగా ప్రయోజనం కలిగించే ఓట్ల చీలికను నిరోధించడానికి నవంబర్ 30 న తెలంగాణలో పోటీ చేయడానికి ఆమె నిరాకరించారు!
ఈ సందర్భంగా స్పందించిన షర్మిల... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నందున తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో కేసీఆర్ తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని.. అందుకే కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని.. వైఎస్సార్ కుమార్తెగా తాను కాంగ్రెస్ కు అవకాశం కల్పించేందుకు మద్దతిస్తున్నానని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో... ఈ నెల 4వ తేదీన తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు షర్మిళ తన పార్టీనేతలతో చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో... అదేరోజు ఆమె అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. అనంతరం... ఆమెకు ఆ పార్టీ ఎలాంటి బాధ్యతలు, మరెలాంటి పదవులు, ఇంకెలాంటి హామీలు ఇవ్వబోతుందనేది వేచి చూడాలి.