షర్మిలకు పాలేరు సీటు ఇవ్వకపోతే..వాట్ నెక్స్ట్...?
వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.
By: Tupaki Desk | 2 Sep 2023 11:13 AM GMTవైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ శతాధిక వృద్ధ పార్టీ. అన్ని విధాలుగా ఢక్కామెక్కీలు తిన్న పార్టీ. ఆ పార్టీ జాతీయ పార్టీ. ఎన్నో వ్యూహాలు ఉంటాయి.ఎందరో లీడర్స్ ఉంటారు. ముందు విలీనం చేసిన తరువాత కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే షర్మిల సంగతి ఏంటి అన్న చర్చ అయితే ఆ పార్టీలో నడుస్తోంది.
ఇక వైఎస్ షర్మిలని కాంగ్రెస్ లో అడుగుపెట్టకుండా టీ కాంగ్రెస్ లీడర్స్ చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు అంటున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కరడు కట్టిన తెలంగాణావాదులు అంతా ఒక్కటిగా మారి షర్మిలను కాంగ్రెస్ లో అడుగుపెట్టనీయకుండా చూస్తున్నారు అని అంటున్నారు.
ఇక వైఎస్ షర్మిలకు ఉన్న ఓటు బ్యాంక్ ఎంత అంటే ఎవరికీ తెలియదు. ఆమె పార్టీ పెట్టి రెండున్నరేళ్ళు అయింది. ఆమె పాదయాత్రలకు సభలకు కొన్ని చోట్ల జనాలు ఎక్కువగా వచ్చినా అవేమీ ఎన్నికల్లో కొలమానం ఎపుడూ కావు. వచ్చిన జనాలు ఓట్లు వేయరు. అలా చూస్తే షర్మిల వల్ల వచ్చే ఓటు బ్యాంక్ ఎంత అన్నది తేలని చర్చగానే ఉంది. అయితే ఆమె రాక వల్ల వైఎస్సార్ అభిమానులు కొంత కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతారు అని భావించినా అది కూడా జస్ట్ వన్ పెర్సెంట్ అని అంటున్నారు.
అలా వన్ పర్సెంట్ ఓట్లు ఆమె వల్ల వచ్చినా ఆంధ్రా మూలాలు ఉన్న షర్మిల తెలంగాణాలో పార్టీలో కీలకం అయితే ఏకంగా తెలంగాణా సెంటిమెంట్ మూలంగా అయిదారు శాతం ఓట్లు కాంగ్రెస్ నుంచి దూరం అవుతాయని కాంగ్రెస్ లో ఆమెను వ్యతిరేకించే నేతలు అంటున్నారు. ముఖ్యంగా షర్మిల చేరికతో ఖమ్మం వంటి జిల్లాలలో సైతం బీయారెస్ కి చాలా రాజకీయ లాభం అడ్వాంటేజ్ కలిగినా ఆశ్చర్యపోనవరసం లేదు అని కూడా అంటున్నారు.
ఇప్పటికి చూస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ దాదాపుగా స్వీప్ చేసే పరిస్థితి కచ్చితంగా ఉందని అంటున్నారు. అలాంటి మంచి వాతావరణాన్ని ఆమెకు పాలేరు టికెట్ ఇచ్చి చెడగొట్టుకోవడమా అన్నది కాంగ్రెస్ లో ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం అంటున్న మాట. ఇందులో కూడా నిజం ఉందని ఇది సరైన విశ్లేషణ అన్న వారూ ఉన్నారు
ఇక షర్మిలను కనుక పార్టీలోకి తీసుకోవాలంటే ఆమెను తెలంగాణా కాంగ్రెస్ లో ప్రత్యక్ష ఎన్నికల్లో దింపకపోవడమే బెటర్ అని అంటున్నారు. ఆమెకు కర్నాటక నుంచి రాజ్యసభ మెంబర్ షిప్ ఇచ్చి కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉంచి ఆ విధంగా ఆమెను తెలంగాణాలో ఎన్న్నికల ప్రచారానికి వాడుకోవడం. ఆ విధంగా చేస్తే ఆమె జాతీయ నాయకురాలిగా ఉంటారు కాబట్టి ఆమె కేసీయార్ ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శించినా ఆమె వల్ల ఎంతో కొంత లాభం వస్తుంది, పైగా ఆమెను ముందు పెట్టి కేసీయార్ తెలంగాణా సెంటిమెంట్ ని పండించేందుకు అవకాశం ఉండదని అంటున్నారు.
ఇక ఆమెను జాతీయ స్థాయిలో పార్టీ అధికార ప్రతినిధిగా చేయడం వల్ల ఫ్యూచర్ లో ఏపీలో జరిగే ఎన్నికల్లో సైతం ఆమె సేవలను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పొందేందుకు అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఆమె వల్ల ఏపీలో కాంగ్రెస్ ఎత్తిగిల్లాలీ అంటే తెలంగాణా రాజకీయాల నుంచి షర్మిలను వేరు చేయడమే మంచిది అని సూచనలు వస్తున్నాయట. ఆమెను పాలేరు నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేయించడం వల్ల లాభం అయితే ఎటూ ఉండదని టీ కాంగ్రెస్ లో ఒక బలమైన వర్గం విశ్లేషిస్తోంది. ఇదే వాదనను వారు హై కమాండ్ కి కూడా వినిపించబోతున్నారు అని అంటున్నారు.
అలా అయితే వైఎస్ షర్మిలను పార్టీలో చేర్చుకుని తెలంగాణా ఎన్నికల్లో స్టార్ కాంపెనియర్ గా వినియోగించవచ్చు అని అంటున్నారు. అయితే షర్మిల పట్టుదల అంతా తెలంగాణా నుంచి రాజకీయాలు చేయాలనే అంటున్నారు. తాను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదివాను, ఇక్కడి కోడలిని అంటూ షర్మిల చెబుతున్న వాదన అంతా బీయారెస్ ముందు వీగిపోతాయని టీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పాలేరు సీటు మీద పట్టుపడుతున్న షర్మిల విషయంలో హై కమాండ్ ఎలా చూస్తుంది. హై కమాండ్ వైఖరి ఏంటి, షర్మిల తరువాత అడుగులు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.