వైఎస్సార్ కి దక్కని కేంద్ర మంత్రి పదవి !
నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వీపీ సింగ్ ప్రధానిగా ఏర్పడింది. దాంతో విపక్ష ఎంపీగానే ఆయన తొలిసారి పార్లమెంట్ లో ఉండాల్సి వచ్చింది.
By: Tupaki Desk | 8 July 2024 3:55 AM GMTవైఎస్సార్ ఏకంగా తొమ్మిదేళ్ల పాటు కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఉన్నారు. ఆయన నాలుగు సార్లు కడప నుంచి వరసగా గెలిచి పార్లమెంట్ సభ్యుడు అయ్యారు. వైఎస్సార్ తొలిసారి 1989లో గెలిచినపుడు కేంద్రంలో కాంగ్రెస్ ఓటమి పాలు అయింది. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వీపీ సింగ్ ప్రధానిగా ఏర్పడింది. దాంతో విపక్ష ఎంపీగానే ఆయన తొలిసారి పార్లమెంట్ లో ఉండాల్సి వచ్చింది.
ఇక 1991లో కాంగ్రెస్ గెలిచింది. పీవీ నరసింహారావు ప్రధానిగా అయిదేళ్ల పాటు కాంగ్రెస్ పాలించింది. ఆ సమయంలో రెండోసారి వైఎస్సార్ కడప నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారు. పీవీ హయాంలో పలు మార్లు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగింది. కానీ వైఎస్సార్ కి కేంద్ర మంత్రి పదవి మాత్రం అందని పండే అయింది.
ఆయన పేరు ప్రతీసారీ ప్రచారంలోకి వచ్చినా చివరి నిముషంలో మాత్రం తేలిపోయేది. వైఎస్సార్ కి కేంద్ర మంత్రి పదవి దక్కకుండా సొంత పార్టీలోనే ఒక వర్గం బలంగా పనిచేయడం వల్లనే ఇలా జరిగింది అని అంటారు. అలా అయిదేళ్ల కాలంలో తన నేత కేంద్ర మంత్రి అవుతారు అని ఆశగా ఎదురుచూసిన కడప జనాలకు పూర్తి నిరాశే మిగిలింది.
అంతే కాదు వైఎస్సార్ అధికారానికి దూరమై అలా గడపాల్సి వచ్చింది. ఇక 1996లో కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరలేదు దాంతో వైఎస్సార్ కి మళ్ళీ మంత్రి పదవి లభించలేదు. ఆ సమయంలో ఏపీ నుంచి తెలుగుదేశం ఎంపీలు చాలా మంది కేంద్ర మంత్రులు అయ్యారు.
అలా విచిత్రంగా కాంగ్రెస్ ఒక పెద్ద పార్టీగా మద్దతు ఇస్తూ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎంపీలు మాత్రం అధికార హోదాకు దూరంగానే ఉన్నారు. అలా అప్పట్లో వైఎస్సార్ రాజకీయంగా ఇబ్బందులే పడ్డారు. 1998లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వాజ్ పేయ్ నాయకత్వంలో ఏర్పాటు కావడంతో యధా ప్రకారం వైఎస్సార్ విపక్ష ఎంపీగా పార్లమెంట్ లో ఉండాల్సి వచ్చింది.
1999 నాటికి ఆయన ఏపీసీసీ చీఫ్ అయి నాటి టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినా కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా మారింది తప్ప అధికారాన్ని అందుకోలేకపోయింది. అలా మరో అయిదేళ్ల పాటు ఏపీలో విపక్ష పాత్రనే వైఎస్సార్ గడపాల్సి వచ్చింది. . మొత్తానికి రాజకీయంగా అన్ని ఒడుదుడుకులనూ దాటుని 2004లో వైఎస్సార్ సీఎం అయ్యారు. అలా చూస్తే కనుక ఆయన 1983 నుంచి 2004 వరకూ 21 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం అధికార హోదాలకు దూరంగానే ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది.