వైఎస్సార్ పోయి.. ఎన్టీఆర్ వచ్చే.. హెల్త్ వర్సిటీ పేరు మార్పు!
అంతేకాదు.. అసలు విజయవాడకు ఆరో గ్య, వైద్య విశ్వవిద్యాలయం అనేది ఎన్టీఆర్ హయాంలోనే తీసుకువచ్చారని
By: Tupaki Desk | 4 Jun 2024 5:38 PM GMTవిజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ.. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 2022-23 మధ్య తీవ్ర స్థాయిలో వివాదం అయిన విషయం తెలిసిందే. మహా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు జాతి గౌరవాన్ని సమున్నతం గా చాటి చెప్పిన అన్నగారి పేరును మార్చడంపై తెలుగు నేలఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. అసలు విజయవాడకు ఆరో గ్య, వైద్య విశ్వవిద్యాలయం అనేది ఎన్టీఆర్ హయాంలోనే తీసుకువచ్చారని.. అందుకే దానికి గుర్తుగా యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని అప్పట్లో చంద్రబాబు కూడా చెప్పారు.
అయితే..వైసీపీ ప్రభుత్వం కనీసం ఎవరి మాటనూ వినిపించుకోలేదు. తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అన్నట్టుగా.. ఎన్టీఆర్ పేరు మార్చి.. దివంగత సీఎం వైఎస్ ఆర్ పేరును జోడించారు. రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయాన్ని తెలల్లవారి కేబినెట్‌లో ఆమోదించి.. నిర్ణయం ప్రకటించారు. అనంతరం. మూడు దశాబ్దాలకు పైగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరున్న ఈ యూనివర్సిటీకి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారిని.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారినికూడా.. అరెస్టు చేశారు. కేసులు పెట్టారు.
ఇక, తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయి.. టీడీపీకూటమి ప్రభంజన విజయం దక్కించుకున్న దరిమిలా.. టీడీపీ శ్రేణులు తిరిగి ఈ విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న డిమాండ్‌ను తెరమీదికి తెచ్చారు. అంతేకాదు.. ఒకవైపు కౌంటింగ్ ఫలితాలు వస్తున్న సమయంలోనే ఇక్కడ వైఎస్ ఆర్ పేరు ధ్వంసం చేయడం చూస్తే.. ఈ పేరు మార్పుపై ఎన్టీఆర్ అబభిమానులు.. ఒకప్పటి విద్యార్థులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్ధమవుతుంది.
ఎన్టీఆర్ పేరు తిరిగి ఈ విశ్వవిద్యాలయానికి పెట్టాలనే డిమాండ్ తో ` వైఎస్ ఆర్ ` స్టీల్ పేరును తీసేశారు. అంతేకాదు.. సిమెంటు కట్టడాన్ని కూడా తొలగించారు. ఏదేమైనా.. జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంతో అటు ఆయన అవమాన పడడమే కాకుండా.. దివంగత వైఎస్సార్ పేరుకు కూడా మచ్చ తెచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.