ఏపీకి కాంగ్రెస్ అబ్జర్వర్ గా వైఎస్ షర్మిళ?
ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిందని తెలుస్తుంది
By: Tupaki Desk | 28 Dec 2023 4:13 AM GMTదక్షిణాదిలో వరుసగా దక్కిన విజయాలతో కొత్త ఉత్సాహం మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దక్షిణాదిలోని మరో రాష్ట్రమైన ఏపీపైనా దృష్టిపెట్టిందని తెలుస్తుంది. కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఉసాహంతో... ఏపీలోనూ పూర్వ వైభవం సాధించాలని భావిస్తూ ఆదిశగా పావులు కదపాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలల్తో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కీలక సమావేశం నిర్వహించారని.. ఈ నేపథ్యంలో షర్మిళకు కీలక బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారని సమాచారం.
అవును... కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలోకి వచ్చినంత ఈజీ కాదు ఏపీలో తిరిగి పూర్వ వైభవం తెచ్చుకోవడం అనే కామెంట్లు వినిపిస్తున్నప్పటికీ... ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఏపీకి సంబంధించి ప్రధానంగా మూడు అంశాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మూడు అంశాల్లోనూ షర్మిళకు కీలక బాధ్యతలు అప్పగించే అంశం ఒకటి అని సమాచారం. అయితే... ఈ విషయంలో షర్మిళ కోరికను మన్నిస్తూనే.. సేవల వినియోగంలో సరికొత్త నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.
ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... పార్టీని విడిచి వెళ్లిన వారికి ఇప్పటికే ఆహ్వానం పలికిందని సమాచారం. ఇదే సమయంలో కర్ణాటక, తెలంగాణల్లో కలిసివచ్చిన గ్యారెంటీలను కూడా ఏపీలో అప్లై చేయాలని చూస్తున్నారట. ఇందులో భాగంగా ఏపీలో ఎలాంటి గ్యారెంటీలు ఇస్తే బాగుంటుందనే విషయంపై దృష్టిపెట్టారని తెలుస్తుంది.
ఇక మూడోదిగా... వైఎస్ షర్మిళ ఏపీ పీసీసీ చీఫ్ చేయాలని కాంగ్రెస్ అధిష్టాణం భావించిందని చెబుతున్నారు. అయితే... షర్మిళ మనసంతా తెలంగాణపైనే ఉందని సమాచారం. దీంతో ఆమె ఏపీలో పీసీసీ బాధ్యతలు తీసుకుని, తెలంగాణకు దూరం అవ్వడానికి ఏమాత్రం సుముఖంగా లేరని తెలుస్తుంది. అయితే... ఏపీలో కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్న ఘర్ వాపసీ సక్సెస్ ఫుల్ గా జరగాలంటే... సరైన ఆకర్షణ కలిగిన నేత అవసరం.
అలాంటప్పుడు షర్మిళ పీసీసీ చీఫ్ కానిపక్షంలో ఘర్ వాపసీకి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు! దీంతో... షర్మిళ ఫేస్ ను ఫేం ను ఎలాగైనా ఏపీలో ఉపయోగించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టాణం... ఏపీ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ గా అయినా బాధ్యతలు స్వీకరించాలని ఒత్తిడి తెస్తుందని సమాచారం! మరి ఈ సమయంలో షర్మిళ.. కాంగ్రెస్ పెద్దలకు ఏమి చెప్పబోతుంది? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అనేది ఆసక్తిగా మారింది.
ఏది ఏమైనా... షర్మిళ ఫేమును ఏపీలో వాడుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆమె నిర్ణయం కోసం వెయిటింగ్... అని తెలుస్తుంది! ప్రస్తుతం హస్తిన కేంద్రంగా ఈ ప్రచారం ఊపందుకోవడం గమనార్హం!