పులివెందుల డౌట్!... రెండు స్థానాల్లో షర్మిళ పోటీ?
గత దశాబ్ధ కాలంగా ఉలుకూ, పలుకూ లేనట్లుగా ఉన్న ఏపీ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చినట్లు తెలుస్తుంది
By: Tupaki Desk | 22 Jan 2024 11:30 AM GMTగత దశాబ్ధ కాలంగా ఉలుకూ, పలుకూ లేనట్లుగా ఉన్న ఏపీ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చినట్లు తెలుస్తుంది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేడర్ లో కదలికలు వచ్చాయని, నేతల్లో స్థబ్ధ పోయిందని చెబుతున్నారు. మరోపక్క వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని షర్మిల ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాను పోటీచేసే విషయంలోనూ షర్మిల ఒక నిర్ణయానికొచ్చారని తెలుస్తుంది.
అవును... ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల తన తొలి ప్రసంగంతోనే ప్రజలకు ఒక సంకేతాన్ని పంపించారు. అటు వైసీపీ, ఇటు టీడీపీలకు సమాన దూరం అనేలా ప్రసంగం కొనసాగించారు. ఈ సందర్భంగా... పీసీసీ ఛీఫ్ గా బాధ్యతల స్వీకరణ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల.. తాను పోటీ చేసే నియోజకవర్గాల్ని ఎంచుకునే పనిలోనూ బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయంలో రెండు మూడు నియోజకవర్గాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు తీసుకోబోతున్నారంటూ కథనాలొచ్చిన సమయంలోనే... ఆమె పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా కానీ, కడప లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా కానీ పోటీ చేసే అవకాశాలున్నాయని అన్నారు. అయితే... ఆమె తమ సొంత గడ్డ కడపతో పాటు ఇటు అమరావతి సమీపంలోని నియోజకవర్గాలపై కూడా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... పులివెందుల నుంచి పోటీచేసే అవాకాశాలున్నాయని చెబుతున్నారు.
ఇదే సమయంలో పులివెందులతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లోని నియోజకవర్గాలలోని పరిస్థితిపై కూడా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా.. ఒకవేళ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం ఉంటే.. షర్మిల ఆ స్థానాన్ని వదిలేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో... కృష్ణా, గుంటూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... ఇందులో విజయవాడ తూర్పు సీటుతో పాటు గుంటూరు పశ్చిమ సీట్లను షర్మిల పరిశీలిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి విజయవాడ తూర్పు, గుంటూరు పశ్చిమ సీట్లు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. ఇందులో భాగంగా... గతంలో ఆరేసి సార్లు ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయాలు నమోదు చేసుకుంది. అయితే రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో ఇక్కడ కూడా ఆ పార్టీ జెండాలు కనుమరుగైపోయాయి.
ఈ సమయంలో పులివెందుల స్థానాన్ని సునీత కు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే... ఈ రెండు స్థానాలలోనూ షర్మిళ పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా... ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లోనూ దేవినేని అవినాష్, విడదల రజనీలను జగన్ ఇన్ ఛార్జ్ లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి... షర్మిల రాక నేపథ్యంలో ఈ స్థానాల్లో ఇన్ ఛార్జ్ లను మారుస్తారా.. లేక, వీరినే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.