షర్మిలకు బీపీ పెరుగుతోంది.. కాస్త పట్టించుకోండి ..!
కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిలకు బీపీ అలా ఇలా కాదు.. భారీ ఎత్తున పెరిగిపోతోంది.
By: Tupaki Desk | 6 Dec 2024 5:34 AM GMTకాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిలకు బీపీ అలా ఇలా కాదు.. భారీ ఎత్తున పెరిగిపోతోంది. తన అన్న, వైసీపీ అధినేతజగన్‌పై పైచేయి సాధించాలన్నది ఆమె ప్రధాన, ఏకైక లక్ష్యం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రజల కష్టాలకు.. అన్న రాజకీయాలను, పాలనను కలగలిపి షర్మిల ఏకేస్తున్నారు. అయినా.. కూడా షర్మిల అనుకున్న విధంగా దూకుడు దక్కించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా.. కేసు వేస్తానని ప్రకటించి సంచలనం రేపారు.
ప్రస్తుతం ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ.. సౌర విద్యుత్‌కు సంబంధించి గత జగన్ సర్కారుతో ఒప్పందాలు చేసుకున్న విషయం, ఈ క్రమంలో జగన్ కు రూ.1750 కోట్ల మేరకు లంచాలు ఇచ్చిన వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారం రెండు రోజులు ఉండి.. తర్వాత మటుమాయం అయింది. దీనికి కారణం.. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలేనన్నది అందరికీ తెలిసిన విషయమే. అదానీకి.. ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలు కూడా తెలిసిందే.
ఈ క్రమంలోనే జగన్‌ను ఈ కేసులో ఇరికించేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నం చేయాలని ఉన్నా.. అదా నీని చూసి.. ఈ కేసును వదులుకుంది. ఇంత వరకుబాగానే ఉంది. కానీ, వదల బొమ్మాళీ అంటూ.. షర్మిల మాత్రం ఈ కేసును పట్టుకుని వేలాడుతున్నారు. కాంగ్రెస్ పెద్దలకు.. అదానీకి మధ్య వివాదాలు ఉండడం .. పార్లమెంటులోనూ.. అదానీ వ్యవహారం తేల్చాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఇదే విషయాన్ని ఇక్కడ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే షర్మిల.. తన అన్నను తాను వదిలి పెట్టనని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఏపీ ఏసీబీకి జగన్‌పై తాము ఫిర్యాదు చేస్తామని ప్రకటించి సంచలనం రేపారు. దీనిపై ఆమె ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కానీ.. ఈ కేసును ఏసీబీ నమోదు చేస్తుందా? చేసినా విచారణ చేస్తుందా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు. ఎందుకంటే పైన చెప్పుకొన్న అదానీ వ్యవహారంతో ముడిపడిన వ్యవహారం కావడంతో రాష్ట్ర సర్కారు లైట్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి.. షర్మిల బీపీ ఇప్పట్లో తగ్గేలా లేదని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయంలో చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని ఆమెను కూల్ చేయాలని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.