కాంగ్రెస్ లో వైసీపీ విలీనం కోరుకుంటున్నారా?... షర్మిల వ్యాఖ్యలు వైరల్!
అవును... తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిళ వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కూటమి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 19 Jun 2024 4:43 PM GMTరామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు తాజాగా.. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. ఇందులో భాగంగా... రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రపటంవద్ద వైఎస్ షర్మిళ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామోజీ సేవలను షర్మిళ కొనియాడారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిళ వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కూటమి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఏపీలో బీజేపీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించాలని, ఒత్తిడి తేవాలని సూచించారు. గతంలో 10 ఏళ్లు హోదా ఇస్తామన్న బీజేపీ తన మాట నిలుపుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే నేడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండేది కాదని చెప్పిన షర్మిళ... టీడీపీ నుంచి గెలిచిన ఎంపీల వల్ల బీజేపీ అధికారంలో ఉందని.. అందువల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో వైఎస్సార్ కల అయిన పోలవరం నిర్మాణం కూడా పూర్తి చేయాలని తెలిపారు.
ఇక గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి పూర్తి చేయలేదని.. అనంతరం రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందని చెప్పిన షర్మిళ... పోలవరం ప్రాజెక్ట్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా... ఎన్డీయే కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలని షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు.
ఇదే క్రమంలో... ఏపీ ఎన్నికల విషయంలో ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని, మార్పుకోసం ఓటు వేశారని చెప్పిన షర్మిళ... ఫర్ జగన్, అగైనెస్ట్ జగన్ పేరుతోనే ఎన్నికలు జరిగినట్లు పేర్కొన్నారు. ఓ సర్వేలో కాంగ్రెస్ కు ఏపీలో 7 - 8 శాతం ఓటింగ్ వచ్చినట్లు వెల్లడించిన ఆమె... తమ ఓటు చీలకూడదని, వృధా కాకూడదన్న ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయలేదని అన్నారు.
ఈ క్రమంలోనే పరోక్షంగా వైసీపీ పై షర్మిళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా పిల్ల కాలువలు అన్ని చివరికి సముద్రంలో కలవాల్సిందేనంటూ (వైసీపీని ఉద్దేశించి) షర్మిళ వ్యాఖ్యానించారు. ఎండిపోతే తప్ప కాలువలన్నీ సముద్రంలోనే కలవాలని.. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని తెలిపారు. ఈ సమయంలో... వైసీపీ నుంచి ఎంత మంది వచ్చినా స్వాగతిస్తామని షర్మిళ చెప్పుకొచ్చారు.