షర్మిల మీద వైసీపీ ట్రోల్స్...!
అయితే వైఎస్ షర్మిల మీద వైసీపీ అనుచరులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు
By: Tupaki Desk | 13 Jan 2024 7:01 PM GMTతన సొంత పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి పొలిటికల్ గా ఫుల్ రిలాక్స్ మూడ్ లో ఉన్న వైఎస్ షర్మిల ఇపుడు కుమారుడు పెళ్ళి పనులతో బిజీ అవుతున్నారు. ఆమె తన కొడుకు పెళ్ళి కోసం ప్రముఖులను పిలిచే పనిలో ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్లుగా ఉన్నారు. ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయనను పెళ్ళికి ఆహ్వానించారు.
అయితే వైఎస్ షర్మిల మీద వైసీపీ అనుచరులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. షర్మిల చంద్రబాబుని కలిసేటపుడు పసుపు చీర కట్టుకున్నారు. దాంతో ఆమె మీద ఒక్క లెక్కన ట్రోలింగ్ చేస్తున్నారు. పసుపు అంటేనే టీడీపీ బ్రాండ్. తెలుగుదేశం పార్టీ గుర్తు అది. ఆ జెండా రంగు పసుపు.
పసుపు రంగు ఎవరికి ఇష్టం ఉన్నా అది టీడీపీదే అన్న భావనతో వేసుకోవడానికి ఆలోచిస్తారు. అయితే షర్మిల మాత్రం చంద్రబాబుని తన రాజకీయ జీవితంలో తొలిసారి పర్సనల్ గా కలవడానికి వెళ్తూ పసుపు రంగు చీర కట్టుకోవడం పట్ల వైసీపీ నిజమైన ఫ్యాన్స్ అయితే హర్ట్ అవుతున్నారు.
ఆమె ఇటీవల కాలంలో టీడీపీతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటున్నారు అన్న భావన అయితే ఉంది. క్రిస్మస్ రోజున లోకేష్ ని గ్రీట్ చేయడం చంద్రబాబుకు క్రిస్మస్ కేక్ పంపించడం వంటివి కరడు కట్టిన వైసీపీ ఫ్యాన్స్ కి అసలు ఇష్టం లేదని అంటున్నారు.
ఇపుడు చంద్రబాబుని కొడుకు పెళ్ళి కోసం పిలవడంలో తప్పు లేదు కానీ ఆమె పసుపు రంగు చీర కాకతాళీయంగా ధరించాలా లేక కావాలనా అన్నదే ఇపుడు ట్రోల్ చేసే వారు గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. షర్మిల వైసీపీకి ఇపుడు ఎదురు నిలిచే అసలైన ప్రత్యర్ధిగా మారిపోయారు అని అంటున్నారు. అంతే కాదు ఆమె రాజకీయం కూడా వైసీపీకి యాంటీగానే ఉంది అని అంటున్నారు.
మొత్తానికి ఒక్క పసుపు చీరతో షర్మిల తాను తెలుగుదేశం వైపే అని చెప్పేశారు అని ట్రోల్స్ పడుతున్నాయి. కానీ అది నిజం కాదు ఆమె తానుగా మీడియాకు చెప్పినట్లుగా రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అన్నది నిజం అంటున్నారు. ఏదేమైనా షర్మిల మాత్రం ట్రోలింగ్ కి గురి అవుతున్నారు.