Begin typing your search above and press return to search.

వైఎస్‌ షర్మిలపై వైసీపీ వ్యూహం మొదలు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులైన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Jan 2024 5:30 PM GMT
వైఎస్‌ షర్మిలపై వైసీపీ వ్యూహం మొదలు!
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నేతలు అప్పుడే తమ వ్యూహాన్ని మొదలుపెట్టేశారని టాక్‌ నడుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కుమారుడు, కుమార్తెగానే వైఎస్‌ జగన్, వైఎస్‌ షర్మిలకు గుర్తింపు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని చేసింది కూడా ఈ కోణంలోనే. వైఎస్సార్‌ కు ప్రజల్లో ఉన్న లెగసీని వాడుకోవడానికే వైఎస్‌ షర్మిలకు అవకాశమిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు వైఎస్‌ జగన్‌ సైతం తన తండ్రి వైఎస్సార్‌ లెగసీ, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణతోనే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. జగన్‌ పార్టీ పేరే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అని తన తండ్రితో మొదలవుతోంది. వైఎస్సార్‌ లెగసీకి తనను మాత్రమే ఏకైక అర్హుడిగా జగన్‌ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్‌ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా రావడంతో జగన్‌ కు పోటీగా షర్మిల కూడా వచ్చినట్టయింది. వైఎస్సార్‌ లెగసీని తన అన్న జగన్‌ తో పాటు షర్మిల ఖచ్చితంగా వాడుకునే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమైంది. జగన్‌ కు చెందిన సాక్షి మీడియాలో కానీ, వైసీపీ అనుకూల మీడియాలోనూ ఎక్కడా వైఎస్‌ అనే ఇంటి పేరును షర్మిల ముందు జత చేయడం లేదు, జగన్‌ కు చెందిన సాక్షి పత్రికలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల అని మాత్రమే పేర్కొనడం ఇందుకు నిదర్శనం. ఎక్కడా కూడా వైఎస్‌ అనే పదమే కనిపించలేదు. అదేవిధంగా వైసీపీ అనుకూల మీడియాలోనూ షర్మిల అని మాత్రమే పేర్కొంటున్నారు లేదా ఆమె భర్త ఇంటిపేరును ఆమె పేరు ముందు చేరుస్తుండటం గమనార్హం.

ఇంకోవైపు వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ఊరూ పేరూ లేని పార్టీ అని.. దానికి.. 0.1 శాతం ఓట్లు కూడా లేవని.. అలాంటి పార్టీకి ఎవరు అధ్యక్షులుగా వస్తే తమకేంటి అంటూ మీడియా ముందు తేలిగ్గా తీసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. లోలోన మాత్రం వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నట్టు చెబుతున్నారు.

వాస్తవానికి.. కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలే ఆ తర్వాత వైసీపీకి మళ్లారు. ఇప్పుడు వైఎస్‌ షర్మిల రూపంలో ఏపీ కాంగ్రెస్‌ కొత్త రూపు సంతరించుకోవడంతో ఈ వర్గాల ఓటు బ్యాంక్‌ కాంగ్రెస్‌ కు మళ్లితే అది అంతిమంగా వైసీపీకే నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిలపై మొదటి రోజు నుంచే వైసీపీ తన గేమ్‌ ను స్టార్ట్‌ చేసిందని అంటున్నారు. ఇందులో భాగంగానే వైఎస్‌ షర్మిలను వైఎస్సార్‌ లెగసీకి దూరం చేసేందుకు ఆమెను కేవలం షర్మిలగా మాత్రమే పేర్కొంటున్నారని అంటున్నారు.