Begin typing your search above and press return to search.

తనకు వైఎస్‌ ట్యాగ్‌ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

తనను మోరుసుపల్లి షర్మిల శాస్త్రిగా వైసీపీ నేతలు, వైసీపీ అనుకూల మీడియా పిలుస్తుండటంపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   26 Jan 2024 6:47 AM GMT
తనకు వైఎస్‌ ట్యాగ్‌ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు!
X

తనను మోరుసుపల్లి షర్మిల శాస్త్రిగా వైసీపీ నేతలు, వైసీపీ అనుకూల మీడియా పిలుస్తుండటంపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్సార్‌ కుమార్తెను అయినప్పుడు తాను వైఎస్‌ షర్మిలను ఎందుకు కాకుండా పోతానని ఆమె హాట్‌ కామెంట్స్‌ చేశారు. చివరకు తన కుమారుడి పేరును కూడా వైఎస్‌ రాజారెడ్డి అని పెట్టినట్టు గుర్తు చేశారు.

తాను రాజశేఖరరెడ్డి రక్తమని వైఎస్‌ షర్మిల తెలిపారు. ఆయన బిడ్డను అయినప్పుడు తాను వైఎస్‌ షర్మిలను ఎందుకు కాకుండా పోతానన్నారు. తన తండ్రే స్వయంగా నా కుమారుడికి వైఎస్‌ రాజారెడ్డి అని పేరు పెట్టుకుంటానని తనను అడిగారని షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ మనవడికి ఈ పేరు లేకుండా ఎలా పోతుందని నిలదీశారు.

విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని షర్మిల ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు.

ఎవరూ కితాబు ఇవ్వకపోయినంతమాత్రాన తన విలువ తక్కువ కాదు.. ఎక్కువా కాదని షర్మిల వ్యాఖ్యానించారు. తాను వైఎస్సార్‌ కుమార్తెను అయినప్పుడు వైఎస్‌ షర్మిల కాకుండా ఎలా ఉంటానని ప్రశ్నించారు. తన కుమారుడికి వైఎస్‌ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నానన్నారు.

తనకు చాలా దగ్గర మనిషి అయిన కొండా రాఘవరెడ్డి కూడా తాను తన అన్న జగన్‌ ను అడిగి పాదయాత్ర చేశానని మాట్లాడుతుండటంపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాఘవరెడ్డి చేసిన ఆరోపణలు నిజం కాదని తాను ప్రమాణం చేస్తానన్నారు. రాఘవరెడ్డి తాను చెప్పేది నిజమేనని ప్రమాణం చేయగలరా అని షర్మిల సవాల్‌ విసిరారు.

అక్రమంగా సంపాదించుకోవడానికి తన భర్తతో జగన్‌ వద్దకు వెళ్లానని తనపై అభాండాలు వేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఏదీ ఆశించి ఇవాళ్టి వరకూ తన అన్న వద్దకు వెళ్లలేదని కుండబద్దలు కొట్టారు. దానికి సాక్ష్యం కూడా తన తల్లేనన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే తన తల్లినే ఈ విషయం అడగాలని సవాల్‌ విసిరారు.

అన్ని వర్గాల వారి కోసం అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించారని షర్మిల తెలిపారు. ఆయన భారీ విగ్రహాలు పెట్టినంతమాత్రాన పేదల ఆకలి తీరదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు వందశాతం పెరిగిపోయాయన్నారు. దారుణంగా చంపి డోర్‌ డెలివరీ చేసినవారిని పక్కన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్‌ గురించి గొప్పగా చెప్పడం కాదు.. ఆయన ఆశయాలను అమలు చేయాలని ఎద్దేవా చేశారు.

కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలు బడుగు, బలహీనవర్గాలను సమానంగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సోషల్‌ జస్టిస్‌ వంద శాతం లేదన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి గుండు కొట్టి అవమానిస్తున్నారని మండిపడ్డారు.

ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీలకు మద్దతు తెలపబోమని ప్రజలు ప్రమాణం చేయాలని కోరారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిల తాజా వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. పదవుల కోసం, ప్రయోజనాల కోసం ఆమె పాదయాత్ర చేశారని, వైఎస్‌ జగన్‌ పై ఒత్తిడి తెచ్చారని సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో షర్మిల తాజా వ్యాఖ్యలతో వారిపై విరుచుకుపడ్డారు.