Begin typing your search above and press return to search.

సీఎం కూడా చీరలను గమనిస్తున్నారంటే... జగన్ పై షర్మిల సెటైర్లు!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయం తీవ్రంగా వేడెక్కుతుంది

By:  Tupaki Desk   |   6 May 2024 10:30 AM GMT
సీఎం కూడా చీరలను గమనిస్తున్నారంటే... జగన్ పై షర్మిల సెటైర్లు!
X

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయం తీవ్రంగా వేడెక్కుతుంది. ఇందులో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ల మధ్య వార్ రసవత్తరంగా మారుతుంది. వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపినవాళ్లు ఆయనకు వారసులు ఎలా అవుతారంటూ జగన్ గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఈ మాటల యుద్ధం మరింత వైరల్ గా మారుతుంది. ఈ నేపథ్యంలో పులివెందులలో జగన్ చేసిన కామెంట్స్ పై షర్మిళ ఆసక్తికరంగా స్పందించారు.

అవును... పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసే రోజు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్... "పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లు వైఎస్సార్‌ వారసులా?" అంటూ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షర్మిళ పసుపు చీర కట్టుకుని ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో... ఆ కామెంట్స్ పై షర్మిళ ఆసక్తికరంగా స్పందించారు.

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో... వైఎస్ జగన్ పసుపు చీర కామెంట్స్ పై స్పందించారు వైఎస్ షర్మిళ! ఇందులో భాగంగా... ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు కూడా ఆడవాళ్లు ఏ చీర కట్టుకున్నారనే విషయం గమనిస్తారని తెలిసి చాలా ఆశ్చర్యం వేసిందని అన్నారు. ఇదే సమయంలో... పసుపు రంగుతో జగన్ కి ఉన్న సమస్య ఏమిటో తనకు అర్ధం కాలేదని తెలిపారు.

అదేవిధంగా... పసుపు రంగు చంద్రబాబు సొంతం కాదని, ఈ రంగుపై ఆయన పేటెంట్ హక్కులు ఏమీ తీసుకోలేదని షర్మిళ కమెంట్ చేశారు. ఇదే క్రమంలో... ఎర్ర రంగు చీర కట్టుకుంటే కమ్యునిస్టు అని, గ్రీన్ కలర్ కట్టుకుంటే ఎంఐఎం అని అనడం అర్ధరహితం అన్నట్లుగా ఆమె స్పందించారు.

ఇదే క్రమంలో... తన సోదరి డిపాజిట్స్ కోల్పోతుండటం తనకు బాధ కలిగిస్తోందని ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు షర్మిళ. ఇందులో భాగంగా... "నేను గెలుస్తున్నాననే విషయం జగన్ కు తెలుసు" అని వ్యాఖ్యానించారు. నిజంగా తాను డిపాజిట్స్ కోల్పోతాననే విషయం తెలిస్తే... అవినాష్ రెడ్డి కానీ, జగన్ కానీ, భారతీ కానీ, పలువురు వైఎస్ కుటుంబ సభ్యులు కానీ 45డిగ్రీ సెల్సియస్ ఎండల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని షర్మిళ ప్రశ్నించారు.

"ఒక వేళ నిజంగానే నేను డిపాజిట్ కోల్పోతాననే బాధ ఉంటే... సింపుల్ గా ఒకపని చేయొచ్చు కదా..! అవినాష్ రెడ్డిని విత్ డ్రా చేసుకోమని చెప్పొచ్చు.. తద్వారా వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ రాసిన లెటర్ కు కూడా గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది.. కానీ ఆయన బాధ నిజం కాదు కాబట్టి అది జరగకపోవచ్చు" అని అన్నారు!