సీఎం, మంత్రులతో షర్మిల వరుస భేటీలు.. మర్మమిదేనా?
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల కడప పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 2 July 2024 10:17 AM GMTఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల కడప పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ నిరాశ చెందకుండా పార్టీ బలోపేతంపై ఆమె దృష్టి సారించారు. ప్రధానంగా ఎన్నికల ముందు వైసీపీలో సీట్లు దక్కని నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు ఎన్నికల్లో ఓడిపోయినా.. కొంతమంది భారీగానే ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది. వీరిలో కీలక నేతలు కూడా ఉన్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో జూలై 8న దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను ఆహ్వానించనున్నారు. తద్వారా వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని షర్మిల భావిస్తున్నారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను కూడా వైఎస్సార్ జయంతి వేడుకలకు ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
ఈ క్రమంలో ముందుగా వైఎస్ షర్మిల తెలంగాణపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులను వైఎస్ షర్మిల కలిశారు. జూలై 8న విజయవాడలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వైఎస్సార్ జయంతి వేడుకలకు రావాలని ఆహ్వానించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వైఎస్సార్ అనుచరులు ఉన్నారు. వీరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటివారు మంత్రులుగా ఉన్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, దానం నాగేందర్ తదితరులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ 75వ జయంతిని పురస్కరించుకుని షర్మిల కాంగ్రెస్ పార్టీ నేతలను ఆహ్వానించారు.
గతంలో వైఎస్ షర్మిల తెలంగాణ వైఎస్సార్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కూడా తన తండ్రి జయంతి వేడుకలను నిర్వహించారు. అయితే అప్పట్లో ఆ వేడుకలకు పెద్దగా నేతలెవరూ రాలేదు. అయితే ఈసారి షర్మిల స్వయంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు.
వైఎస్సార్ జయంతిని భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా ఆయనకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలనేదే షర్మిల వ్యూహమని అంటున్నారు, తన అన్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో వైసీపీలో కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. అలాంటి వారందరినీ ఆకర్షించడానికి వైఎస్సార్ జయంతి వేడుకలే సందర్భమని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలు కూడా హాజరయితే షర్మిల లక్ష్యం కొంతవరకు నెరవేరినట్టేనని అంటున్నారు.