సమస్య జగన్ తోనా.. భారతి తోనా?... షర్మిల సమాధానం ఇదే!
ప్రధానంగా షర్మిళ ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ వైఎస్ కుటుంబంలో రాజకీయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
By: Tupaki Desk | 9 May 2024 4:45 AM GMTఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ వర్సెస్ కూటమి రాజకీయం సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రధానంగా షర్మిళ వర్సెస్ జగన్ మధ్య రాజకీయం మరింత చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా షర్మిళ ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ వైఎస్ కుటుంబంలో రాజకీయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
ఇక కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి షర్మిళ, వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీకి నిలబడేసరికి వ్యవహారం పీక్స్ కి చేరింది. ఈ సందర్భంగా వైఎస్ వివేకా హత్య అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకుంటూ వైఎస్ షర్మిల... అవినాష్ పై విరుచుకుపడుతున్నారు.. అతనికి టిక్కెట్ ఇచ్చిన జగన్ పైనా నిప్పులు కక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఇస్తున్న టీవీ ఇంటర్వ్యూలలోనూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా చిన్నాన్నను హత్య కేసులో నిందితులకు టిక్కెట్లు ఇచ్చారంటూ జగన్ పై విమర్శలు చేస్తున్న షర్మిళ.. ఇటీవల వదిన భారతి పైనా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వివేకాపై గొడ్డలితో దాడి జరిగి, మెదడు బయటకు వచ్చేసిందట.. కానీ సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని భారతి ప్రసారం చేశారంటూ నిప్పులు చెరిగారు. ఇలా గత కొన్ని రోజులుగా వైఎస్ భారతిని కూడా షర్మిళ టార్గెట్ చేస్తున్నారు.
పైగా... కేంద్రంలో 'బీ' అనే రిమోట్ తోనూ, ఇంట్లో మరో 'బీ' అనే రిమోట్ తోనూ జగన్ పనిచేస్తారని చెబుతూ... కేంద్రంలో బీ అంటే బీజేపీ అని చెప్పారు. అంటే... ఇంట్లో బీ అంటే భారతి అనే విషయంపై ప్రజలకు పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఈ విధంగా తన వదినపై ఇటీవల కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు వైఎస్ షర్మిళ. ఈ క్రమంలో.. అసలు షర్మిళకు సమస్య అన్నతోనా, వదినతోనా అనే ప్రశ్న ఎదురైంది.
అవును... ఇటీవల కాలంలో రాజకీయ ప్రత్యర్థి అయిన తన అన్న వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో ఫైరవుతున్న షర్మిళ... తన వదినపైనా సెటైర్లు పేలుస్తున్నారు. ఈ సమయంలో... అసలు షర్మిళకు సమస్య ఎవరితో అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా స్పందించిన షర్మిళ... "వివరాలు అనవసరం కానీ, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు, వాళ్లిద్దరూ భార్య భర్తలు" అని నర్మగర్భంగా స్పందించడం గమనార్హం!
అంటే... షర్మిళ ఉద్దేశ్యం ఇద్దరితోనూ తనకు సమస్య ఉందని చెప్పడమా.. లేక, అన్నను పెళ్లి చేసుకుంది కాబట్టి వదిన ఒక్కరితోనే సమస్య అయినా ఇద్దరూ భార్య భర్తలు కాబట్టి ఆ వివరాలు చెప్పలేమని చెప్పడమా అన్నది మాత్రం క్లారిటీ రాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి!