Begin typing your search above and press return to search.

విలీనం కోసం భర్తతో ఢిల్లీకి వెళ్లిన షర్మిల!

టీవైసీపీ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే తుది నిర్ణయాన్ని తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:31 AM GMT
విలీనం కోసం భర్తతో ఢిల్లీకి వెళ్లిన షర్మిల!
X

తన తండ్రి పేరు మీద రాజకీయ పార్టీ పెట్టి.. తెలంగాణలో తన సత్తా చాటాలని భావించిన టీవైసీపీ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే తుది నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా భర్తతో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆమె.. ఈ రోజు (గురువారం) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అవుతారని చెబుతున్నారు. తాను స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసేందుకు సిద్ధమైన ఆమె.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు జరిగినట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. సోనియాతో భేటీ అనంతరం ఆమె తన పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేస్తారని చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజా టూర్ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలకు కానీ.. భద్రతా సిబ్బందికి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భర్తతో కలిసి డిల్లీకి వెళ్లిన షర్మిల వైనం ఆసక్తికరంగా మారింది. సెప్టెంబరు 2న వైఎస్ వర్థంతి ఉన్న నేపథ్యంలో.. ఈ లోపు విలీనంపై కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. విలీనం నేపథ్యంలో పార్టీ నుంచి స్పష్టమైన హామీని ఆమె పొందినట్లుగా తెలుస్తోంది.

వీలిన ప్రక్రియ అనంతరం షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. తొలుత తెలంగాణలో ఆమె సేవలు వినియోగించుకోవాలని అనుకున్నా.. ఆంధ్రా సెంటిమెంట్ పార్టీని దెబ్బ తీస్తుందన్న ఉద్దేశంతో ఆమెను ఏపీకి పంపాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిన నేపథ్యంలో షర్మిల రాకతో ఏపీలో పార్టీ పుంజుకోవటానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా జరిగిన మంతనాలతో ఆమెను పార్టీలోకి తీసుకునేందుకు అధినాయకత్వం ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. అన్న మీద చెల్లెల్ని ప్రయోగించటం ద్వారా ఏపీలో కాంగ్రెస్ పునరజ్జీవానికి దోహదం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. సోనియాతో భేటీ అనంతరం షర్మిల కీలక ప్రకటన చేస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది.