Begin typing your search above and press return to search.

షర్మిల నిప్పులు బలంగా మారాయా? తాజా స్పీచ్ ప్రభావమెంత?

ఈ సందర్భంగా ఆమె ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా తనదైన మాటలతో ఏపీ అధికార పక్షానికి షాకులమీద షాకులు ఇస్తూ ప్రసంగించారు.

By:  Tupaki Desk   |   3 April 2024 4:46 AM GMT
షర్మిల నిప్పులు బలంగా మారాయా? తాజా స్పీచ్ ప్రభావమెంత?
X

వైఎస్ షర్మిల మరోసారి మాట్లాడారు. ఈసారి మరింత సూటిగా.. పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా మాట్లారు. తన అన్న కం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకరు కాదన్న వ్యాఖ్య చేసిన ఆమె.. తన ప్రసంగంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు అధికార పక్షానికి నిప్పు కణికల్లా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఇడుపులపాయలో తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ మీద అభ్యర్థుల తొలి జాబితాను పెట్టి తనను ఆశీర్వదించాలన్నారు. షర్మిల వెంట ఆమె తల్లి విజయమ్మ ఉన్నారు. లిస్టు ప్రకటించే వేళలో షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. 114 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని.. ఐదుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆమె ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా తనదైన మాటలతో ఏపీ అధికార పక్షానికి షాకులమీద షాకులు ఇస్తూ ప్రసంగించారు.

షర్మిల ప్రసంగంలో షాకింత్ అంశాల్ని చూస్తే..

- ‘జగన్మోహన్‌రెడ్డి నా అన్న.. నా రక్తం.. అన్నంటే నాకు ద్వేషం లేదు. ఎన్నికల్లో నన్ను చెల్లి కాదు బిడ్డ అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడు.. ముఖ్యమంత్రి జగన్‌ ఎవరో నాకు పరిచయం లేడు. ఈ సీఎం నా అనుకున్న వాళ్లందరినీ నాశనం చేశాడు.

- హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడు. చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపిన వాళ్లకే కడప ఎంపీ టికెట్‌ ఇచ్చాడు ఇది తట్టుకోలేకపోయా.

- హత్య చేసిన వాళ్లను, చేయించిన వాళ్లను తప్పిస్తున్నారు. ఎంపీని వెనకేసుకొచ్చారు. వివేకా హత్యను రాజకీయానికి వాడుకున్నారు. సొంత చిన్నాన్నకే న్యాయం జరగలేదంటే ప్రజలకు ఏం జరుగుతుంది? చిన్నాన్న కోరిక మేరకు కడప ఎంపీగా పోటీ చేస్తున్నా.

- ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ హంతకులను ఈ ఐదేళ్లూ వెనకేసుకొచ్చారు. ఇది ఘోరమని తెలిసినా.. ప్రజలు హర్షించరని తెలిసినా.. ఎంత అహంకారం కాకపోతే మళ్లీ అదే అవినాశ్‌రెడ్డికి టికెట్ ఇస్తారు?

- రాజకీయ లబ్ధి కోసం వివేకాను హత్య చేస్తే అదే హంతకులకు జగనన్న అండగా నిలబడ్డాడు. మరి రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా నేను ఏం చేయాలి? ఆయన తమ్ముడికే న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈరోజు కోర్టులు, గడపగడపా తిరుగుతోంది.

- అసలు కనికరం లేదా? వారినే హంతకులు అంటున్నారే.. హృదయం లేదా? ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాశ్‌ను నిలబెట్టారు కాబట్టి.. ఇది హత్యా రాజకీయం కాబట్టి.. ఒక హంతకుడు, హత్య చేయించిన వాళ్లు చట్టసభల్లోకి వెళ్లకూడదనే నేను పోటీచేస్తున్నా.

- ఒక్క చాన్సిస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. స్వప్రయోజనాల కోసం దానిని బీజేపీకి తాకట్టుపెట్టాడు. పోలవరం నిర్మిస్తానన్నాడు.. బీజేపీతో కుమ్మక్కయ్యాడు. ఆ పార్టీకి బానిసగా మారాడు. వారు ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ మద్దతిచ్చాడు. మణిపూర్‌ విషయంలో బీజేపీని వ్యతిరేకించలేదు.

- ఒక్క చాన్స్‌ ఇవ్వండి రాజధాని కడతానని.. మద్యనిషేధమని మహిళలను, పేదవాళ్లకు ఇళ్లు అని పేదలను.. జాబులని నిరుద్యోగులను మోసం చేశాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. ఎక్కడ చూసినా డ్రగ్సే.

- రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ నాయకుడు. ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తన ఆఖరి నిమిషం వరకు కాంగ్రెసే దేశంలో అధికారంలో ఉండాలి.. అప్పుడే దేశ ప్రజలకు రక్షణ ఉంటుందని అన్నారు. ఆఖరి కోరిక కూడా రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలన్నదే. రాజశేఖర్‌రెడ్డి బతికిఉంటే ఆ కోరికను నిజం చేసేవారు. రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా చెబుతున్నా.. కాంగ్రె్‌సను ఆశీర్వదించండి... రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలనను ఆయన బిడ్డగా నేను తీసుకొస్తా.

ఎన్నికల బరిలో తానెందుకు దిగానన్న అంశానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చేసిన షర్మిల.. తన సోదరుడు కం ఏపీ సీఎంపై చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నిప్పు కణికల మాదిరి ఉన్న ఆమె మాటలకు ధీటైన కౌంటర్ ఎవరి చేత ఇప్పించాలన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. షర్మిల వ్యాఖ్యలకు ఎవరి చేత చెక్ చెప్పిస్తే బాగుంటుందన్నది అధికారపక్షంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బయట వారి కంటే సొంతోళ్ల చేతే మాట్లాడపిస్తేనే షర్మిల ఆరోపణలకు బలమైన కౌంటర్ ఇచ్చినట్లుగా మారుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. జగన్ ఏ అస్త్రాన్ని తన సోదరి మీద ప్రయోగిస్తారన్నది ఉత్కంటగా మారింది.