Begin typing your search above and press return to search.

షర్మిలను తిప్పుతున్నారే తప్ప?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎష్ షర్మిల పరిస్థితి డోలాయమానంలో పడింది.

By:  Tupaki Desk   |   1 Sep 2023 6:38 AM GMT
షర్మిలను తిప్పుతున్నారే తప్ప?
X

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎష్ షర్మిల పరిస్థితి డోలాయమానంలో పడింది. కాంగ్రెస్లో పార్టీ విలీనం గురించి ఆమె ఎటూ తేల్చుకోలేక పోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం షర్మిలను ఢిల్లీకి, తెలంగాణకు తిప్పడం తప్ప తుది నిర్ణయం వెల్లడించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. షర్మిల డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడం, షర్మిల ప్రతిపాదనలకు కాంగ్రెస్ అధిష్ఠానం సమ్మతించకపోవడమే సమస్యగా మారిందని టాక్. తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్లి వచ్చిన షర్మిల విలీనంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

తన పార్టీకి తెలంగాణలో అనుకున్నంత ఆదరణ దక్కకపోవడంతో కాంగ్రెస్లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. దీని కోసం బెంగళూరులో వెళ్లి డీకే శివకుమార్ తో షర్మిల మంతనాలు జరిపారని తెలిసిందే. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మాత్రం షర్మిలకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమైన షర్మిల అందుకోసం కొన్ని డిమాండ్లు కాంగ్రెస్ ముందు ఉంచినట్లు టాక్. పాలేరు నుంచి తనకు అసెంబ్లీ సీటు కేటాయించడంతో పాటు తాను సూచించిన అభ్యర్థులకు కొన్ని టికెట్లు ఇవ్వడం ఇందులో ప్రధానమైందని చెబుతున్నారు.

కానీ కాంగ్రెస్లోకి షర్మిల రాకను తెలంగాణ నాయకులు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. షర్మిల పార్టీలోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్కు ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం అందులోనూ ముఖ్యంగా సోనియా గాంధీ.. షర్మిలను ఏపీకి పరిమితం చేసేందుకే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఇప్పటికే పాలేరు టికెట్ కోసం కాంగ్రెస్లో డిమాండ్ ఉంది. అందుకే తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇక్కడ షర్మిలను ఉపయోగించుకుని, ఆ తర్వాత పార్టీ ప్రయోజనాల కోసమని చెప్పి ఏపీలో రంగంలో దింపాలన్నది సోనియా ఆలోచనగా ఉందని టాక్. అందుకే షర్మిలతో చర్చలు ఒక కొలిక్కి రావడం లేదని తెలిసింది. తాజాగా ఇండియా కూటమికి వెళ్లేందుకు సోనియా, రాహుల్ సిద్ధమవడంతో షర్మిలతో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయించలేదని కూడా తెలిసింది.