Begin typing your search above and press return to search.

అంతా ష‌ర్మిల‌కు న‌చ్చిన‌ట్టే ఉండాలా..?

అతి పెద్ద కాంగ్రెస్ పార్టీలో క్షేత్ర‌స్థాయి నాయ‌కులు తీసుకునే నిర్ణ‌యాల‌క‌న్నా.. అధిష్టానం తీసుకునే నిర్ణ‌యాల‌కే ప్రాధాన్యం ఉంటుంది.

By:  Tupaki Desk   |   13 Aug 2024 9:30 AM GMT
అంతా ష‌ర్మిల‌కు న‌చ్చిన‌ట్టే ఉండాలా..?
X

అతి పెద్ద కాంగ్రెస్ పార్టీలో క్షేత్ర‌స్థాయి నాయ‌కులు తీసుకునే నిర్ణ‌యాల‌క‌న్నా.. అధిష్టానం తీసుకునే నిర్ణ‌యాల‌కే ప్రాధాన్యం ఉంటుంది. అధిష్టాన‌మే అన్నీ తానై.. రాష్ట్రాల రాజ‌కీయాల‌ను కూడా స‌రిదిద్దు తుంది. రాష్ట్రాల స్థాయిలో నాయ‌కుల‌ను కూడా ఎంపిక చేస్తుంది. ఇప్ప‌టికీ దాదాపు అదే విధానం కొన‌సాగుతోంది. అయితే.. గ‌తంలో వైఎస్ జీవించి ఉన్న స‌మ‌యంలో అంత పెద్ద జాతీయ పార్టీని కూడా క్షేత్ర‌స్థాయికి తీసుకువ‌చ్చారు. ఉమ్మ‌డి ఏపీలో 2002-2009 వ‌ర‌కు కూడా ఆయ‌నే అన్నీ అయ్యారు.

అంటే.. తాను చెప్పిన వారికే టికెట్లు ఇచ్చేలా, తాను తెచ్చిన ప‌థ‌కాల‌కు జై కొట్టేలా వ్య‌వ‌హ‌రించారు. దీనికి అధిష్టానం కూడా మొగ్గు చూపింది. దీంతోవైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని ఎదిరించే నాయ‌కుడు అంటూ ఏపీలో క‌నిపించ‌లేదు. అంతేకాదు.. ఆయ‌న అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా.. ఆయ‌న చెప్పిందే వేదంగా భావిం చారు. దీనిపై అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను వైఎస్ ప్రాంతీయ పార్టీ చేశారంటూ.. అస‌మ్మ‌తి నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు.

అయిన‌ప్ప‌టికీ.. అధిష్టానం త‌న నిర్ణ‌యంలో ఎలాంటి మార్పులూ చేయ‌లేదు. ఇక‌, ఇప్పుడు ఈ పంథాలో నే ఏపీ పీసీసీ చీఫ్‌, వైఎస్ త‌న ష‌ర్మిల కూడా ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఆమె ఢిల్లీలో ప‌ర్య‌టిస్తు న్నారు. దీనికి ప్రాధాన్యం ఏంటంటే.. ఆమె రాష్ట్రంలో క‌మిటీలు ఏర్పాటు చేసేందుకు, జిల్లాల స్థాయిలో ఇంచార్జ్‌ల‌ను నియ‌మించేందుకు రెడీ అయ్యారు. ఈ స‌మ‌యంలో ఆమె త‌న‌కు న‌చ్చిన వారిని, త‌ను మెచ్చిన వారిని ప‌ద‌వుల్లో కూర్చోబెట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

గ‌తంలో త‌న తండ్రి వైఎస్ అనుస‌రించిన విధానాన్నే ష‌ర్మిల పాటిస్తున్నారు. దీనికి సంబంధించి మొ త్తం 52 మంది పేర్ల‌తో అతిపెద్ద జాబితానే ష‌ర్మిల స‌మ‌ర్పించారు. ఈ జాబితాకు అధిష్టానం ఓకే చెబితే.. ఇక‌, ఏపీలో ష‌ర్మిలకు మ‌ద్ద‌తిచ్చే నాయ‌కులే కాంగ్రెస్‌లో క‌నిపిస్తారు. అయితే.. దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది చూడాలి. అప్ప‌టి వైఎస్ కు అంత ప్రాధాన్యం ఇవ్వ‌డానికి ఆయ‌న పార్టీని పుంజుకునేలా చేశారు.

అధికారంలోకి తీసుకు వ‌చ్చారు.కానీ, ఇప్పుడు ష‌ర్మిల‌.. వ్య‌క్తిగ‌త అజెండాతో ముందుకు సాగుతున్నారే త‌ప్ప‌.. పార్టీని బ‌ల‌ప‌ర‌చ‌లేక పోతున్నారు. ఈ మైన‌స్‌ను పార్టీ అధిష్టానం క‌నుక ప‌రిగ‌ణ‌న‌లోకితీసుకుంటే.. ష‌ర్మిల జాబితాను ప‌క్క‌న పెడుతుంది. కాదంటే మాత్రం ఆమె చెప్పిన వారికే ప‌ద‌వులు వ‌రించ‌నున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.