Begin typing your search above and press return to search.

ఏపీలో కాంగ్రెస్ అసలు సినిమా చూపిస్తుందా ?

తాజా ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పుంజుకోలేదు. కానీ అనుకున్నది అయితే సాధించింది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 3:32 AM GMT
ఏపీలో కాంగ్రెస్ అసలు సినిమా చూపిస్తుందా ?
X

తాజా ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పుంజుకోలేదు. కానీ అనుకున్నది అయితే సాధించింది. వైసీపీని గద్దె దించాలన్నది కాంగ్రెస్ టార్గెట్. ఎందుకు అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ కొల్లగొట్టుకుని పోయింది. లీడర్ క్యాడర్ అంతా అటు వైపే మళ్ళారు. వారంతా వైఎస్సార్ భక్తులుగా ఉంటూ జగన్ సీఎం కావాలని తపించారు.

అలా పదేళ్ల పాటు జగన్ తోనే వారు ఉన్నారు. జగన్ సీఎం అయ్యారు. అయిదేళ్ల పాలన సాగింది. క్యాడర్ ని పట్టించుకోలేదు అన్న విమర్శలు ఒక వైపు ఉంటే సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్ సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ లో చేరి చేయాల్సిన నష్టం వైసీపీకి చేసింది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

మొత్తానికి వైసీపీ ఓడింది. దాంతో కాంగ్రెస్ తొలి విజయం సాధించింది అని అంటున్నారు. ఇక మలి విజయం ఏమిటి అంటే వైసీపీ ఓటు బ్యాంక్ ని తమవైపునకు తిప్పుకోవడం. ఈ కార్యక్రమం కోసం కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు.

తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లారు. ఆమె కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెప్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను కలిశారు. ఇది ఆకస్మికంగా కాదు ఒక వ్యూహం ప్రకారమే జరిగిన సమావేశం అని అంటున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు వైఎస్సార్ తనయ మీద విశ్వాసం ఉంచి మరీ ఆమెని పిలిచి భేటీ వేశారు అని అంటున్నారు.

ఇక ఈ భేటీ సోనియా నివాసంలో జరిగింది. చాలా విషయాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ ని పైకి లేపడానికి ఇదే సరైన తరుణం అని ఆ పార్టీ అగ్ర నేతలు భావిస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీ బలహీనపడింది.

పొత్తులతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. దాని సుస్థిరత మీద కూడా సందేహాలు అనేకం ఉన్నాయి. ఇక తాజా ఎన్నికల్లో ఇండియా కూటమి బలపడింది. వచ్చే ఎన్నికలు 2029లో జరిగినా లేక మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఈసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ తో ఉంది అని అంటున్నారు. అందుకే ఏపీ మీద ఫోకస్ పెడుతున్నారు అని తెలుస్తోంది.

ఏపీలో ఓటమి తరువాత క్రమంగా వైసీపీ వీక్ అవుతుందని అదే అదనుగా కాంగ్రెస్ దూకుడు పెంచితే పాత కాపులతో పాటు ఇతర నేతలు కూడా కాంగ్రెస్ వైపు వస్తారు అని ఆలోచిస్తున్నారు. ఇక ఏపీలో కొందరు కాంగ్రెస్ నేతలు షర్మిల మీద విమర్శలు చేశారు. సుంకర పద్మశ్రీ అనే మహిళా నేత కూడా షర్మిలను రాజీనామా చేయమని డిమాండ్ చేశారు.

కానీ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మాత్రం షర్మిల వైపే ఉన్నట్లుగా తాజా భేటీని బట్టి అర్ధం అవుతోంది. పైగా షర్మిల ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాక వైసీపీని గద్దె దించడంతో తన వంతు పాత్ర పోషించారు.ఆ విధంగా ఆమె సక్సెస్ అయినట్లే ఇపుడు ఆమె పీసీసీ చీఫ్ గా ఉంటేనే వైసీపీని మరింతగా వీక్ చేయవచ్చు అన్నదే కాంగ్రెస్ నేతల ఎత్తుగడ అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సమావేశంపై షర్మిల ట్వీట్ చేశారు. "సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఢిల్లీలోని వారి నివాసంలో కలిశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణకు సంబంధించి ఆసక్తికరమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ తీరుతెన్నులు, ఇతర అంశాలపై నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం సంపాదించుకోవడమే కాదు ఒక బలీయమైన శక్తిగా అవతరిస్తుంది. ఈ దిశగా మరిన్ని అడుగులు పడనున్నాయన్న విషయం తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను" అని షర్మిల వివరించారు.

దీనిని బట్టి చూస్తే రానున్న రోజులలో రెట్టించిన ఉత్సాహంతో షర్మిల ఏపీలో తన రాజకీయ పర్యటనలు చేస్తారని అర్ధం అవుతోంది. అయితే ఆమె ఈసారి వైసీపీ మీద కంటే టీడీపీ కూటమి మీదనే విమర్శలు చేస్తేనే ఏపీలో కాంగ్రెస్ బలపడేందుకు ఆస్కారం ఉంటుంది. మొత్తానికి ఏపీలో వైసీపీకి పక్కలో బల్లెం లా కాంగ్రెస్ పొంచి ఉన్నది అని అర్ధం అవుతున్న విషయం.