బీజేపీ ఉంచుకున్న పార్టీగా వైసీపీ... షర్మిళ అంతమాట అనేశారేంటి?
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు వైఎస్ షర్మిళ
By: Tupaki Desk | 13 July 2024 4:20 AM GMTఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు వైఎస్ షర్మిళ. నాటి నుంచి అవకాశం అందివచ్చిన ప్రతీసారీ ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ.. తన సోదరుడు వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థుల కంటే ఎక్కువగా అన్నట్లుగా జగన్ పై ఆమె నిత్యం నిప్పుల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ప్రక్రియ సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో తీవ్రస్థాయిలో నడిచింది. కట్ చేస్తే... ఏపీలో ఎన్నికలు పూర్తవ్వడం, జగన్ 11 స్థానాలేకే పరిమితమవ్వడం, కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం తెలిసిందే. ఇలా గడిచిన ఎన్నికల్లో తన అన్న చావుదెబ్బ తిన్నా కూడా షర్మిళ వదిలిపెట్టడం లేదు.. వెంటాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాజా శుక్రవారం మైకుల ముందుకు వచ్చిన ఆమె... మరోసారి జగన్ పై నిప్పులు చెరిగారు.
అవును... అవకాశం వచ్చిన ప్రతీసారీ తన అన్న చేసిన, చేస్తోన్న రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు వైఎస్ షర్మిళ. ఇందులో ప్రధానంగా ఎన్డీయే కూటమిలో భాగస్వామి కాకపోయినా బీజేపీతో అంటకాగుతున్నారు అంటూ నిప్పులు చెరుగుతుంటారు. అధికారంలో ఉన్నా, నేడు విపక్షంలో ఉన్నా కూడా కేంద్రంలోని బీజేపీ కి మద్దతు పలుకుతుంటారు.. వారు తానా అంటే తందానా అంటారు అంటూ విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా మరింత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు షర్మిళ. తాజాగా సంచలన విమర్శలే చేశారు. ఇందులో భాగంగా... బీజేపీకి తొత్తుగా, తోకపార్టీగా అంటూనే... ఉంచుకున్న పార్టీగా ఉంది వైసీపీ అని, బీజేపీకి జగన్ ఊడిగం చేస్తున్నారని షర్మిళ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలూ ఊడిగం చేయడమే కాకుండా... ప్రతిపక్షంలోకి వచ్చాకా ఆ పని మానలేదని ఎద్దేవా చేశారు.
ఇటీవల జరిగిన లోక్ సభ స్పీకర్ ఎన్నికలో కూడా బీజేపీకి జగన్ మద్దతిచ్చారని దుబ్బయట్టారు. మణిపూర్ ఘటన సహా ఏది తీసుకున్నా, ఎలా చూసుకున్నా జగన్.. బీజేపీతోనే ఉన్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజానికం వైసీపీని గొయ్యి తీసి పాతిపెట్టినా కూడా ఇంకా జగన్ లొ మార్పు రాలేదని, బీజేపీతో అంటకాగడం మానలేదని షర్మిళ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
ఇదే సమయంలో... వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని.. వైఎస్సార్ కాంగ్రెస్ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని అన్నారు. ఇటీవల వైఎస్సార్ 75వ జయంతిని గొప్పగా చేయకుండా.. మొక్కుబడిగ చేశారని.. ఇడుపుల పాయకు వెళ్లి ఐదు నిమిషాలు అక్కడ నిలబడి నివాళులు అర్పించి వచ్చేశారని విమర్శించారు. సిద్ధం అంటూ భారీ సభలు పెట్టిన జగన్ కు తండ్రి 75 జయంతి విషయంలో అలాంటి ఆలోచన రాలేదా అని నిలదీశారు.